అందుబాటులో 25,991 ఎంబీఏ సీట్లు

అందుబాటులో 25,991 ఎంబీఏ సీట్లు
  • 28 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 305 ఎంబీఏ కాలేజీల్లో 25991 సీట్లు, 90 ఎంసీఏ కాలేజీల్లో 6404 సీట్లు ఉన్నట్టు చెప్పారు. ఎంబీఏలో 26 వర్సిటీ కాలేజీలు ఉండగా.. 1490 సీట్లు, 279  ప్రైవేటు కాలేజీలు ఉండగా, 24501 సీట్లున్నాయని తెలిపారు. ఎంసీఏలో 18 వర్సిటీ కాలేజీల్లో 1020 సీట్లు, 72 ప్రైవేటు కాలేజీల్లో 5384 సీట్లున్నాయని వివరించారు.

 రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభమైందన్నారు. ఈనెల28 వరకూ ఆన్ లైన్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, 29 వరకూ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. సోమవారం నాటికి 22,563 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారని, 14301 మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు.