2600 పడకలతో అమృత హాస్పిటల్​ ఏర్పాటు

2600 పడకలతో అమృత హాస్పిటల్​ ఏర్పాటు
  • హర్యానాలోని ఫరీదాబాద్​లో ప్రారంభించిన మోడీ
  • తొలిదశలో 500 బెడ్లు అందుబాటులోకి..

ఫరీదాబాద్​(హర్యానా): ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్​ హాస్పిటల్​ ‘అమృత హాస్పిటల్​’ను బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మాతా అమృతానందమయితో కలిసి ఈ ఆస్పత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రధాని చెప్పారు. ఫరీదాబాద్​లో నిర్మిస్తున్న అత్యాధునిక టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ కలిగిన ప్రైవేట్​ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్ ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇండియాలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉందని అన్నారు. దీనికి కరోనా పర్​ఫెక్ట్​ ఉదాహరణ అని చెప్పారు. ఆధ్యాత్మికత, ప్రైవేటు భాగస్వామ్యంతోనే కరోనా మహమ్మారిపై విజయం సాధించామని గుర్తుచేశారు. కరోనాపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. హెల్త్​కేర్​ సెక్టార్​లో టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. టెక్నాలజీ, ఆధునికీకరణ అనే అంశాలు ఇండియా హెల్త్​కేర్​ రంగం అభివృద్ధిలో కీలకమని వివరించారు.  “అమ్మ ప్రేమ, కరుణ, సేవ, త్యాగ స్వరూపం. ఆమె భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయానికి మూలం” అని మాతా అమృతానందమయిని ప్రధాని మోడీ ప్రశంసించారు. 

81 స్పెషాలిటీస్​తో ఏర్పాటు..

అమృత హాస్పిటల్​ను మొత్తం 81 స్పెషాలిటీస్​తో ఏర్పాటుచేసినట్లు హాస్పిటల్స్​ గ్రూప్​ మెడికల్​ డైరెక్టర్​ డాక్టర్​ ప్రేమ్​ నాయర్​ చెప్పారు. ఈ హాస్పిటల్​లో ముందుగా 500 బెడ్స్​ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రాబోయే ఐదేండ్లలో దశలవారీగా పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నారు. ప్రారంభోత్సవంలో హర్యానా గవర్నర్​ దత్తాత్రేయ, సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్, మాతా 
అమృతానందమయి తదితరులు ​హాజరయ్యారు.

ఆస్పత్రి విశేషాలు..

  •     130 ఎకరాల్లో  14 ఫ్లోర్లతో ఏర్పాటు
  •     ఏడు అంతస్తుల బిల్డింగ్​లో రీసెర్చ్​ సెంటర్​
  •     పేషెంట్ల తరలింపునకు హెలీప్యాడ్​
  •     2600 పడకల సామర్థ్యం
  •     534 క్రిటికల్​ కేర్​ బెడ్లు
  •     64 మాడ్యులర్​ ఆపరేషన్​ థియేటర్లు
  •     తల్లీబిడ్డల సంరక్షణ కోసమే ప్రత్యేకంగా ఓ ఫ్లోర్​ కేటాయింపు
  •     800 మంది డాక్టర్లు, 2500 మంది పారామెడికల్​ స్టాఫ్​
  •     రోగుల కుటుంబ సభ్యుల కోసం 498 రూమ్​ల గెస్ట్​హౌస్
  •     క్యాంపస్​లోనే మెడికల్​ కాలేజీ