2,613 టీఎంసీలు సముద్రం పాలు

2,613 టీఎంసీలు సముద్రం పాలు

ఈ ఫ్లడ్‌ సీజన్‌లో బంగాళాఖాతంలోకి నదుల పరుగు

గోదావరి నుంచి 2,459 టీఎంసీలు.. కృష్ణా నది నుండి 154 టఎంసీలు

హైదరాబాద్‌, వెలుగువరుసగా రెండో ఏడాది కృష్ణా నది పోటెత్తుతోంది. ఇప్పటికే నది నుంచి 154 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిశాయి. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల గేట్లు మూడో సారి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉండటంతో.. ఎగువన మళ్లీ వర్షాలు కురిస్తే ఆ నీళ్లు కూడా సముద్రంలోకే వెళ్లిపోనున్నాయి. గోదావరి నది నుంచి ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా భారీగా నీళ్లు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇప్పటివరకు 2,459 టీఎంసీలు ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలిసిపోయాయి.

గోదావరిలో దిగువన..

గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత నది ఉధృతంగా ప్రవహిస్తుండగా.. కృష్ణాలో ఎగువ నుంచే భారీ ప్రవాహాలు కొనసాగుతున్నాయి. నిరుడు గోదావరి నుంచి 3,797.31 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 254.11 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకున్నాయి. కృష్ణా నది నుంచి నిరుడు 797.12 టీఎంసీలు సముద్రంలోకిపోగా.. 179.88 టీఎంసీల నీళ్లు ఉపయోగించుకున్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో మరో 300 టీఎంసీల వరకు నిల్వ ఉంచారు.

కృష్ణాలో ఈఏడాదే మూడోసారి..

నిరుడు కృష్ణా బేసిన్‌లో నాలుగుసార్లు భారీ వరద వచ్చి ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. ఈ ఏడాది ఇప్పటికే మూడోసారి గేట్లు ఎత్తారు. మళ్లీ భారీ వర్షాలు కురిసే చాన్స్​ ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. దీంతో ఈసారి కూడా ఇంకో 200 టీఎంసీలకు పైగానే నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోయే చాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణా నది నుంచి 2010–11లో 402 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లగా.. ఆ తర్వాతి ఏడాది 209 టీఎంసీలు వదిలేశారు. తిరిగి మళ్లీ ఈసారే వరుసగా రెండో ఏడాది ఎక్కువ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2013–14లో 433 టీఎంసీలను సముద్రంలోకి వదలగా ఆ తర్వాతి ఏడాది కొద్దిపాటే నీళ్లే బంగాళాఖాతంలోకి చేరాయి. 2015–16లో ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వచ్చిన 9.20 టీఎంసీల నీటిని మాత్రం కిందికి వదిలేశారు. 2017–18లో చుక్క నీరు కూడా ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వెళ్లలేదు.  2018–19లో 39 టీఎంసీలు వెళ్లాయి. గోదావరి నుంచి అయితే ఏటా ఏకంగా మూడు వేల టీఎంసీల నీళ్లు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి

నిండుకుండలా ఎస్సారెస్పీ

గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు నిలకడగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 26 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. వరద కాల్వ, పవర్‌ హౌస్‌, కాల్వల ద్వారా అదే స్థాయిలో నీళ్లను వదులుతున్నారు. ఎస్సారెస్పీ నుంచి మిడ్‌ మానేరులోకి రోజుకో టీఎంసీకిపైగా నీళ్లు చేరుతున్నాయి. ఇంకో నాలుగు టీఎంసీలు చేరితే ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి 6 వేల క్యూసెక్కులకుపైగా నదిలోకి వదులుతున్నారు. ఇక కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి ప్రవాహం కాస్త తగ్గింది. ఆల్మట్టి, నారాయణపూర్‌కు ప్రవాహాలు తగ్గడంతో పవర్‌ హౌస్‌ల ద్వారా 3 టీఎంసీలకు పైగా నీటిని నదిలోకి వదులుతున్నారు. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో జూరాలకు భారీ వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.59 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా గేట్ల ద్వారా 1.49 లక్షల క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్‌కు 1.41 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. లక్ష క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు.