చంచల్‌‌‌‌గూడ జైలులో కొట్టుకున్న ఖైదీలు

చంచల్‌‌‌‌గూడ జైలులో కొట్టుకున్న ఖైదీలు
  • మెడికల్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ విషయంలో గొడవ
  • ఒక ఖైదీ చేతిని మెలితిప్పిన మరో ఖైదీ
  • తనపై చర్యలు తీసుకుంటారన్న భయంతో తనకు తాను గాయం చేసుకున్న మరో ఖైదీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చంచల్ గూడ సెంట్రల్‌‌‌‌ జైల్లో రిమాండ్‌‌‌‌లో ఉన్న ఖైదీలు కొట్టుకున్నారు. ఇద్దరు పాత నేరస్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వారిద్దరికి గాయాలు కాగా, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన.. బుధవారం వెలుగులోకి వచ్చింది. జైలులోని ఖైదీలకు ప్రతి రోజు సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. 

ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం కూడా జైలు హాస్పిటల్‌‌‌‌లో వైద్య పరీక్షలు చేపట్టారు. ఒక్కొక్కరుగా ఖైదీల హెల్త్‌‌‌‌ చెకప్ చేస్తున్నారు. చోరీలు సహా పలు నేరాలు చేసిన రౌడీ షీటర్‌‌‌‌‌‌‌‌ దస్తగిరి నెల రోజులుగా చంచల్‌‌‌‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మరో పాత నేరస్తుడు, రౌడీ షీటర్‌‌‌‌‌‌‌‌ జాబ్రి ఓ కేసులో అరెస్ట్‌‌‌‌ అయ్యి మంగళవారం జైలుకు వచ్చాడు. 

వీరిద్దరూ చాలా సార్లు జైలుకు రావడంతో పరిచయం ఏర్పడింది. కలిసి తిరిగేవారు. గతంలో వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలు, వివాదాల వల్ల ఒకరిపై ఒకరికి ద్వేషం పెరిగింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం జైలు దవాఖాన వద్ద వీరిద్దరు ఎదురుపడ్డారు. మెడికల్‌‌‌‌ టెస్టులకు నేను ముందు వెళ్తానంటే.. నేనంటూ ఇద్దరికి మాటమాట పెరిగింది. ఈ క్రమంలో జాబ్రి.. దస్తగిరి చేతిని మెలేశాడు. 

వెంటనే జైలు అధికారులు అప్రమత్తమై వారిని విడిపించారు. అనంతరం గాయపడిన దస్తగిరిని ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అయితే, తనపై జైలు అధికారులు చర్యలు తీసుకుంటారనే భయంతో జాబ్రి కూడా తన చేతికి తానే గాయం చేసుకున్నాడు. గమనించిన పోలీసులు అతన్ని కూడా గాంధీ హాస్పిటల్‌‌‌‌కు తరలించి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తున్నారు.