- ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విస్తరణ పనులు స్పీడప్ కావడంతో, ఆలయంలో దర్శనాలను బుధవారం నుంచి నిలిపివేశారు. రాజన్న ఆలయ ప్రధాన ద్వారాన్ని పూర్తిగా క్లోజ్ చేసి, భీమేశ్వర ఆలయంలో దర్శనాలు జరుగుతున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయంగా భీమేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు కొనసాగిస్తున్నారు.
అలాగే ఆలయం ముందు భాగంలో ప్రచార రథంలో దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు రాజన్న ఆలయ ఆవరణలోని ఈవో ఆఫీస్, కల్యాణకట్ట, కళాభవన్, ఆలయ ప్రాకార గోడలు, క్యూలైన్లు, పైకప్పు షెడ్లను తొలగించగా, భక్తులకు లఘు దర్శనం అమలు చేశారు. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది.
అలాగే ఆలయ అవరణలో పనులు ప్రారంభం కావడంతో, భక్తులకు ఇబ్బంది కలగకుండా భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కు, అభిషేకాలు, అన్నపూజ. కుంకుమపూజ, నిత్యకల్యాణం, చండీహోమం వంటి ఆర్జిత సేవల కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈవో రమాదేవి తెలిపారు. ఆలయ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సీఐలు వెంకటేశ్వర్లు, రవి కుమార్, శ్రీనివాస్, యాదగిరి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఆలయ అభివృద్ధికి సహకరించాలి..
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, భక్తులు సహకరించాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కోరారు. బుధవారం ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఆలయ అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవతో రూ.150 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. శృంగేరి జగద్గురు విధిశేఖర భారతి స్వామి అనుమతితో, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాజన్న ఆలయం బంద్ అనేది అవాస్తవమని, స్వామి వారికి నిత్య పూజలు ఏకాంతగా జరుగుతాయని స్పష్టం చేశారు.
