V6 News

ఒకే అపార్ట్మెంట్.. 27 ఇంకుడు గుంతలు..500 ఫీట్ల లోతులో ఉన్న నీళ్లు 200 ఫీట్లకు ఎగబాకినయ్

ఒకే అపార్ట్మెంట్.. 27 ఇంకుడు గుంతలు..500 ఫీట్ల లోతులో ఉన్న నీళ్లు  200 ఫీట్లకు ఎగబాకినయ్
  • ట్యాంకర్లు రావు.. నీటి కరువు ఉండదు
  • బోయిగూడ ఎంఎన్​కే వాసులు ‘జల విజయం’
  • 500 ఫీట్ల లోతులో ఉన్న నీళ్లు  200 ఫీట్లకు ఎగబాకినయ్

పద్మారావునగర్, వెలుగు: నీటి సంరక్షణ విషయంలో సికింద్రాబాద్​బోయగూడలోని ఎంఎన్​కే సెంట్రల్ కోర్టు అపార్ట్​మెంట్ వాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరు వేల గజాల విస్తీర్ణంలోని 90 ఫ్లాట్లుతో ఉన్న ఈ అపార్ట్​మెంట్​లో సుమారు 3 వేల మంది ఉంటున్నారు. ప్రతి వేసవిలో నీటి ట్యాంకర్ల కోసం వీరు రూ. లక్షలు ఖర్చు పెట్టేవారు.

అయితే, 2014లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఏడు  ఫీట్ల లోతుతో గ్రౌండ్​ ఫ్లోర్​లో 23 చిన్న ఇంకుడు గుంతలు సెల్లార్​ లో 20 ఫీట్ల లోతుతో  రెండు పెద్దవి, మెయిన్​గేట్​ఎంట్రన్స్​ లో 200 ఫీట్ల లోతుతో రెండు ఇంజక్షన్​బోర్​ ఇంకుడు గుంతలు తవ్వించారు.  మొత్తం 27 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూమిలోకి వెళ్లేలా చేశారు. ఫలితంగా 500 ఫీట్ల లోతున ఉన్న నీరు 200 ఫీట్ల వరకు వచ్చింది.

దీంతో ఇప్పుడు వీరికి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ట్యాంకర్ల కోసం ఖర్చయ్యే డబ్బు ఆదా కావడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలోను కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా అపార్ట్​మెంట్ ప్రెసిడెంట్ జీ హనుమాండ్లు, అసోసియేషన్​ జాయింట్​ సెక్రటరీ వి.శ్రీనివాసన్, సెక్రటరీ సేతు మాధవరావు, మెంబర్లు రంగనాయకమ్మ, రామేశ్వర్​మాట్లాడుతూ తాము ఎండాకాలంలో నీళ్లకు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లమని, ఇంకుడు గుంతల నిర్మాణంతో ఆ సమస్య తీరిందని, స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత నిర్మించుకోవాలని చెప్తున్నారు.