గుజరాత్: భారీ వర్షాలకు 27 రాష్ట్ర హైవేల మూసివేత

గుజరాత్: భారీ వర్షాలకు 27 రాష్ట్ర హైవేల మూసివేత
  • ఈనెల 7 నుంచి కురుస్తున్న వర్షాలకు 43కు చేరిన మృతుల సంఖ్య
  • ముంబయి -అహ్మదాబాద్ హైవేను ముంచెత్తిన భారీ వరద

అహ్మదాబాద్: భారీ వర్షాలు గుజరాత్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని నవ్ సరి జిల్లాలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తపి, వడోదర జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న 45 మందిని రక్షించారు. ఈనెల 7 నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా గుజరాత్ లో ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా పుర్ణా, అంబికా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అహ్మదాబాద్-ముంబై జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫలితంగా గుజరాత్ లో 27 రాష్ట్ర హైవేలను మూసేశారు.

అహ్మదాబాద్ నగర వీధుల్లో కలుషిత వరద నీరు
గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్ సిటీలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అహ్మదాబాద్ వీధుల్లోకి చేరిన వరద నీరు నురగలుగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. చెడు వాసనతో అవస్థలు పడుతున్నారు. సమీపంలోని సరస్ పుర్ టైక్స్ టైల్ మిల్లు వ్యర్థ జలాలే రోడ్లపైకి వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మిల్లు యాజమాన్యం కనీస జాగ్రత్తలు పాటించలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.