హైదరాబాద్‌‌కు రోజుకు 270 ఎంజీడీల నీటి సరఫరా

హైదరాబాద్‌‌కు రోజుకు 270 ఎంజీడీల నీటి సరఫరా

గ్రేటర్​ హైదరాబాద్​ సిటీకి నాగార్జునసాగర్​ నుంచి  కృష్ణా ప్రాజెక్టు మూడు దశల ద్వారా రోజుకు 270 ఎంజీడీ (మిలియన్​ గ్యాలన్స్ ఫర్​ డే) నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా సాగర్​ నుంచి అక్కంపల్లి రిజర్వాయర్​కు నీటిని తరలిస్తారు. తిరిగి అక్కడి నుంచి కోదండాపూర్ లోని నీటి శుద్ధి కేంద్రానికి పంపింగ్​చేస్తారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని హైదరాబాద్​ నగర శివారులోని బొంగుళూరు బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​కు తరలించి, అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం సాగర్​లో  నీటి నిల్వలు భారీగా అడుగంటడంతో సాగర్​లోని పుట్టంగండి వద్ద పంపింగ్​ ఏర్పాట్లు చేసి, నీటిని నేరుగా కోదండాపూర్​ నీటి శుద్ధి కేంద్రానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్​హైదరాబాద్​ పరిధిలో నాగార్జునసాగర్​ నుంచి కృష్ణా ప్రాజెక్టు, ఎల్లం పల్లి నుంచి గోదావరి ప్రాజెక్టు, సింగూరు, మంజీరా, ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్​ల నుంచి రోజుకు 500 ఎంజీడీల నీరు సరఫరా అవుతోంది. ప్రధానంగా నాగార్జునసాగర్​ నుంచే 270 ఎంజీడీలు సరఫరా అవుతుండడం గమనార్హం. 

హైదరాబాద్​ నీటి అవసరాలు 50 శాతం నాగార్జునసాగర్​ ద్వారానే తీరుతున్నాయి.  కాగా, వచ్చే నెల 15 తేదీ నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్​ నుంచి గోదావరి జలాల  అత్యవసర పంపింగ్ ప్రారంభిస్తున్నట్టు అధికారులు వివరించారు.  ఇదే కాకుండా.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు జలాశయాల్లో పుష్కలంగా నీరుందని.. హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని చెప్తున్నారు. అవసరమైతే రెండు రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా తాగునీరు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  దీంతో ఈ వేసవి కాలం వెళ్లే వరకూ ముఖ్యంగా జూన్​ఆఖరు నాటికి హైదరాబాద్​ నగరానికి నీటి ఎద్దడి అన్నది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.