- తుర్కపల్లి ‘కాలా’ పరిధిలో స్టార్ట్
- ‘స్ట్రక్చర్స్’ లేని భూముల నిర్వాసితులకే ఫస్ట్ పేమెంట్
యాదాద్రి, వెలుగు : ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణ ప్రక్రియ ముందుకు పడింది. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం అందుతోంది. భూముల్లో ఎలాంటి స్ట్రక్చర్స్ లేని నిర్వాసితుల అకౌంట్లలో మొదటగా పరిహారం జమ అవుతోంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో నిర్మాణం కానున్న ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కోసం 2022లో భూసేకరణ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించడానికి ఆయా జిల్లాల్లో 8 ‘కాలా’ (కాంపిటెంట్ అథారిటీ ల్యాండ్ అక్విజిషన్)లను ఏర్పాటు చేసి అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలను బాధ్యులుగా నియమించారు.
యాదాద్రి జిల్లాలో 59.33 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 1,795 ఎకరాలను తుర్కపల్లి, భువనగిరి, చౌటుప్పల్ ‘కాలా’ పరిధిలోని 24 గ్రామాల్లో సేకరించాల్సి ఉంది. తుర్కపల్లి ‘కాలా’ పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సేకరించే భూముల్లోని బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్ట్రక్చర్ ఎంక్వైరీ ముగిసింది.
మొత్తం 510 ఎకరాల్లో స్ట్రక్చర్ ఎంక్వైరీతో పాటు వెరిఫికేషన్ సైతం ముగిసింది. చౌటుప్పల్ పరిధిలో స్ట్రక్చర్ ఎంక్వైరీ, వెరిఫికేషన్ ముగిసిన గ్రామాల్లో భూములు కోల్పోతున్న వారికి నోటీసులు జారీ చేశారు. దీంతో నిర్వాసితులు తమ అకౌంట్లతో పాటు భూమి, ఇంటి స్థలాలకు సంబంధించిన వివరాలను ఆఫీసర్లకు అందజేశారు. చౌటుప్పల్ పరిధిలోని 900 మంది, తుర్కపల్లి పరిధిలోని 1,589 మంది కలిపి మొత్తం 2,489 మందిలో వెయ్యి మందికి పైగా చెందిన వివరాలను భూమి రాశి పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు.
49 అకౌంట్లలో రూ. 2.03 కోట్లు
భూమి రాశి పోర్టల్‌లో అప్‌లోడ్ అయిన వివరాలను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీ, జీఎం వేర్వేరుగా పరిశీలించారు. అనంతరం భూముల్లో ఎలాంటి స్ట్రక్చర్స్ (చెట్లు, కట్టడాలు, బావులు సహా ఇతరాలు) లేని వారికి పరిహారం అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట తుర్కపల్లి కాలా పరిధిలో ఎలాంటి స్ట్రక్చర్స్ లేని భూములకు సంబంధించిన 49 మంది అకౌంట్లలో మొత్తం రూ. 2.03 కోట్లు శుక్రవారం జమ అయ్యాయి.
చౌటుప్పల్ పరిధిలోని వలిగొండ మండలానికి చెందిన నిర్వాసితుల వివరాల అప్‌లోడ్ ప్రక్రియ సాగుతోంది. వీరికి కూడా త్వరలోనే పరిహారం అందనుందని ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా, భువనగిరి ‘కాలా’ పరిధిలోని రైతులు తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోలేదు.
స్ట్రక్చర్ ఎంక్వైరీ సైతం జరగనీయలేదు. భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించడం, సర్వేను అడ్డుకోవడంతో ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మారుతుందన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నిర్వాసితుల అకౌంట్లలో పరిహారం జమ అవుతుండడంతో ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌లో మార్పు ఉండబోతని స్పష్టం అవుతోంది.
