వరకట్న వేధింపులతో గర్భిణి సూసైడ్‌‌ ..పెద్దపల్లి జిల్లా రామగిరిలో దారుణం

వరకట్న వేధింపులతో గర్భిణి సూసైడ్‌‌ ..పెద్దపల్లి జిల్లా రామగిరిలో దారుణం

పెద్దపల్లి, వెలుగు : అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో శుక్రవారం జరిగింది. ఎస్సై శ్రీనివాస్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... పోతారం గ్రామానికి చెందిన ఒడ్నాల రాజేశం కూతురు సుప్రియ (24)కు కల్వచర్ల గ్రామానికి చెందిన వేముల సతీశ్‌‌తో 2023లో వివాహమైంది. వివాహ సమయంలో సుప్రియ తల్లిదండ్రులు 13 తులాల బంగారం, రూ.2 లక్షల విలువైన గృహోపకార వస్తువులను కట్నంగా ఇచ్చారు. 

సుప్రియను రెండేండ్ల బాబు ఉండగా.. ప్రస్తుతం నిండు గర్భిణి. ఇదిలా ఉండగా.. మరో రూ.2 లక్షల కట్నం తేవాలంటూ సతీశ్‌‌తో పాటు అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సుప్రియను వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సుప్రియ తన తండ్రికి చెప్పడంతో ఇటీవల పోతారం ఇరు కుటుంబాలతో పంచాయితీ నిర్వహించిన అనంతరం సతీశ్‌‌ సుప్రియను తీసుకొని తన ఇంటికి వెళ్లాడు. తర్వాత కట్నం కోసం మరోసారి వేధిస్తుండడంతో తట్టుకోలేని సుప్రియ శుక్రవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

భర్త సతీశ్‌‌, అత్తమామలు భూలక్ష్మి చంద్రయ్య, బావ స్వామి వేధింపుల వల్లే సుప్రియ ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.