మహబూబ్‌నగర్, వెలుగు : ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించి, పారదర్శక పాలన అందించడం, జవాబుదారీతనాన్ని పెంచడమే ఆర్టీఐ చట్టం ముఖ్య ఉద్దేశమని చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. సమాచార హక్కు చట్టంపై పీఐవోలు, ఏపీఐవోలకు శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కమిషనర్లు పీవీ.శ్రీనివాసరావు, మోసినా ఫర్వీన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ... నారాయణపేట జిల్లాలో పెండింగ్ కేసులు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరిస్తే పూర్తిస్థాయిలో సమస్య తీరిపోతుందన్నారు. పీఐవోలు, ఏపీఐవోలు ఆర్టీఐ నుంచి తప్పించుకునే ధోరణి వదిలేసి, చట్టాన్ని అర్థం చేసుకొని అమలు చేయాలన్నారు. ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంలో నారాయణపేట జిల్లాను ఫస్ట్ ప్లేస్‌లో నిలపాలని సూచించారు.
పీఐఓ స్థాయిలోనే దరఖాస్తులను పరిష్కరిస్తే పై స్థాయికి వచ్చే అవకాశం ఉండదని, దీని వల్ల పెండింగ్ దరఖాస్తులు ఉండబోవన్నారు. ఆర్టీఐ చట్టం, సెక్షన్స్‌కు సంబంధించిన పుస్తకాలను అందజేస్తామని చెప్పారు. ఆర్టీఐ ద్వారానే 90 శాతం సమాచారం ఇస్తున్నామని, 10 శాతం మాత్రమే అప్పీల్‌కు వస్తున్నాయని చెప్పారు.
గత మూడున్నరేళ్లు కమిషనర్ల నియామకం లేకపోవడంతో చాలా అప్లికేషన్లు పెండింగ్‌లో పడ్డాయని.. జిల్లాల పర్యటన సందర్భంగా అందరికీ అవగాహన కల్పిస్తూ అప్లికేషన్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అంతకుముందు కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్లు శ్రీను, సంచిత్ పూలమొక్క అందజేసి స్వాగతం పలుకగా.. పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. అవగాహన సదస్సులో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, ఆర్డీఓ రామచంద్రనాయక్, డీఎస్పీ మహేశ్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరాం ప్రణీత్, ఫణికుమార్ పాల్గొన్నారు.
