మహబూబాబాద్ జిల్లాలో 27.6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

మహబూబాబాద్ జిల్లాలో 27.6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

గూడూరు, వెలుగు: గంజాయి అక్రమ రవాణాపై మహబూబాబాద్​ జిల్లా గూడూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి 27.6 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.13.82 లక్షలుగా అంచనా వేశారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన మారుతి కారు, రెండు సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లను సీజ్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 5న ఉదయం గూడూరు ఎస్సై చిర్రా రమేశ్​బాబు సిబ్బందితో కలిసి కోబల్ తండా ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మారుతి కారును ఆపి తనిఖీ చేయగా, డిక్కీలో 27.6 కిలోల ఎండు గంజాయి లభించింది. విచారణలో నిందితులు ఏపీలోని చింతూరు ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఓ వ్యక్తికి అందజేసేందుకు తరలిస్తున్నట్లు వెల్లడైంది.

ఈ కేసులో మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన లావుడ్య దేవి అలియాస్ ఝాన్సీ, భూక్య నవీన్ ను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. కాగా, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, కొనుగోళ్లు, వినియోగం, నిల్వపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే గూడూరు పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు తగిన నగదు పారితోషికం అందజేస్తామని తెలిపారు.