ప్రజావాణికి 2,793 అర్జీలు..చలిని సైతం లెక్కచేయకుండా క్యూ కట్టిన జనం

ప్రజావాణికి 2,793 అర్జీలు..చలిని సైతం లెక్కచేయకుండా క్యూ కట్టిన జనం
  •     చలిని సైతం లెక్కచేయక తెల్లవారుజామునే ప్రజాభవన్ వద్ద క్యూ కట్టిన జనం
  •      ఫిర్యాదులను  స్వీకరించిన అధికారులు

పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని  జ్యోతిబాఫూలే ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల జనం భారీగా తరలివచ్చారు.  చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామున 5.30 గంటల నుంచే క్యూ లైన్లలో నిలబడ్డారు.  ఉదయం 6 గంటల నుంచి అధికారులు వారిని లోపలికి పంపారు.  8 గంటల నుంచి నోడల్ అధికారి దాసరి హరిచందన పర్యవేక్షణలో ఫిర్యాదులను స్వీకరించారు. మంగళవారం మొత్తం 2,793 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.  డబుల్​బెడ్రూం​ఇండ్లు కావాలని, ఉద్యోగాలు కల్పించాలని, గ్రూప్​–4, ఎఈఈ పరీక్షా ఫలితాలు వెల్లడించాలని.. ఇలా పలు సమస్యలపై జనం అర్జీలు పెట్టుకున్నారు. 

ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి

రాష్ట్రంలో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టాలని కోరుతూ స్పౌజ్ ఫోరం ఆధ్వర్యంలో  ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీచర్ వివేక్ ​మాట్లాడుతూ.. 13 జిల్లాల నుంచి 1500 మంది క్రమం తప్పకుండా  సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు అప్పీల్​ చేస్తున్నామని ఆయన చెప్పారు.  భర్త ఒక జిల్లా, భార్య మరో జిల్లాలో విధులు నిర్వహిస్తూ నరకం అనుభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల  రెండేండ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నామన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.

గ్రూప్ – 4, ఏఈఈ రిజల్ట్స్ వెల్లడించాలి

గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4, ఏఈఈ పరీక్షా ఫలితాలను వెల్లడించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరుతూ పలువురు నిరుద్యోగులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 1,540  ఉద్యోగాలకు  27 వేల మంది దరఖాస్తులు చేశారని,  జనవరి నెలలో ఒకసారి,  మే నెలలో మరోసారి పరీక్షలు నిర్వహించినట్లు పవన్, శరత్​ తెలిపారు. వీటి రిజల్ట్స్​ను వీలైనంత తొందరగా వెల్లడించాలని కోరారు.

ప్రజా భవన్ పేరుతో వెబ్ సైట్?

ఇప్పటివరకు  ఫిర్యాదు దారుల నుంచి తీసుకున్న వినతులను  జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ, వాటర్​ వర్క్స్​అధికారుల పర్యవేక్షణలో ఎన్ రోల్ చేసేవారు. అయితే, ఆ బాధ్యతను మరో విభాగానికి అప్పగించారు.   ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎన్​రోల్​ చేసే బాధ్యతను సెక్రటేరియట్​లోని ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్​ కమ్యూనికేషన్ కు అప్పగించారు. తొందరలోనే ప్రజా భవన్ పేరుతో ఓ వెబ్ సైట్ ఏర్పాటు కానుంది. ఆ వెబ్​సైట్​లో అన్ని వివరాలు ఉంటాయని అధికారులు తెలిపారు. 

 ఉద్యోగం ఇప్పించండి..

గచ్చిబౌలి డివిజన్ హఫీజ్ పేటలో విద్యుత్ ఉద్యోగిగా పనిచేస్తున్న సదానంద్ కరెంట్ షాక్ తో గాయపడి చనిపోయాడు. అయితే,  భర్త ఉద్యోగం తనకు ఇప్పించాలంటూ సదానంద్ భార్య వందన ప్రజావాణిలో అర్జీ పెట్టుకుంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని వందన ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలతో కుటుంబపోషణ కష్టంగా మారిందని.. ఆర్థికసాయంతో పాటు ఉద్యోగం ఇప్పించాలని ఆమె కోరింది.