ఆన్​లైన్​ గేమింగ్​పై 28% జీఎస్టీ

ఆన్​లైన్​ గేమింగ్​పై 28% జీఎస్టీ
  • జీఎస్టీ 18% నుంచి ఐదు శాతానికి కుదిస్తూ నిర్ణయం  
  • ఎంయూవీలపై 22%  కాంపెన్సేషన్​ సెస్

న్యూఢిల్లీ: ఆన్​లైన్​ గేమింగ్​, హార్స్​ రేసింగ్​, కేసినోలపై 28 శాతం జీఎస్​టీ విధించాలని జీఎస్​టీ కౌన్సిల్​ నిర్ణయించింది. ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీల టర్నోవర్​పైనే ఈ పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ వెల్లడించారు.  జీఎస్​టీ కౌన్సిల్​50 వ మీటింగ్​ మంగళవారం జరిగింది.  కిందటి సమావేశంలోనే ఈ అంశంపై గ్రూప్​ ఆఫ్​ మినిస్టర్స్​కు ఒక అంగీకారం కుదిరినప్పటికీ, ఆన్​లైన్​ గేమింగ్​పై  గోవా ప్రభుత్వం ప్లాట్​ఫామ్​ ఫీజు కింద 18 శాతాన్ని ప్రతిపాదించడంతో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. గేమ్​ ఆఫ్​ స్కిల్​, గేమ్​ ఆఫ్​ ఛాన్స్​లు రెండింటినీ ఒకలాగే పరిగణించడానికి  జీఎస్​టీ కౌన్సిల్​ ఒప్పుకుంది. గేమింగ్​ ఫుల్​ వాల్యూ మీద, హార్స్​రేసింగ్​, కేసినోలో గెలిచిన మొత్తం మీదా 28 శాతం జీఎస్​టీ విధింపు గేమింగ్​ ఇండస్ట్రీపై గ్రోత్​ను దెబ్బతీస్తుందని ఎన్​ఏ షా అసోసియేట్స్​ పార్ట్​నర్​ పరాగ్​ మెహతా చెప్పారు. 28 శాతం జీఎస్​టీ చాలా ఎక్కువని, అంత పన్ను భరించడం ఏ పరిశ్రమ వల్లా కాదని  కొన్ని ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలు సీబీఐసీకి విజ్ఞప్తి చేశాయి.

థియేటర్లో అమ్మే తినుబండారాలపై స్పష్టత...

సినిమా టికెట్ల అమ్మకం, థియేటర్లో అమ్మే పాప్​కార్న్​, కూల్​డ్రింక్స్​వంటి వాటిపై జీఎస్​టీ విధింపులో జీఎస్​టీ కౌన్సిల్​ స్పష్టత తీసుకు వచ్చింది. సినిమా టికెట్లతో క్లబ్​ చేసి అమ్మే తినుబండారాలను కాంపోజిట్​ సప్లయ్​గా పరిగణించాలని, సినిమా టికెట్లపై ఉండే జీఎస్​టీ రేటే తినుబండారాలపైనా వర్తిస్తుందని జీఎస్​టీ కౌన్సిల్​ స్పష్టత ఇచ్చింది. కానీ, విడిగా కొనుక్కునే ఫుడ్​ ఐటమ్స్​పై మాత్రం జీఎస్టీ 5 శాతమే ఉంటుంది. సినీప్లెక్స్​లలోని రెస్టారెంట్లపై ఇక మీదట 5 శాతం జీఎస్​టీ విధించనున్నారు. ఇప్పటిదాకా వాటిపై 18 శాతం జీఎస్​టీ ఉంది. ఈ మార్పు తేవడానికి ముందు, సినిమా టికెట్​ రూ. 100 లోపుంటే 12 శాతం జీఎస్​టీ, అంతకు మించితే 18 శాతం జీఎస్​టీ అమలవుతోంది. అన్​కుక్డ్​ ఫుడ్​ పాలెట్​, ఫిష్​ సాల్యుబుల్​ పేస్ట్​ వంటి వాటిపై గతంలోని 18 శాతం జీఎస్​టీని తాజాగా 5 శాతానికి తగ్గించారు.

కేన్సర్​ డ్రగ్స్​కు మినహాయింపు....

కేన్సర్​ చికిత్సలో వాడే డినుటుక్సిమాబ్​ (దిగుమతి చేసుకునే మెడిసిన్​) పై జీఎస్​టీ మినహాయించాలని కౌన్సిల్​ నిర్ణయించింది. అదేవిధంగా, కొన్ని ప్రత్యేక వ్యాధుల ట్రీట్​మెంట్​కోసం ఉపయోగించే ఫుడ్​ ఫర్​ స్పెషల్​ మెడికల్​ పర్పసెస్ (ఎఫ్​ఎస్​ఎంపీ)పై కూడా మినహాయింపు అమలు చేయనున్నారు. ఇప్పటిదాకా వాటిపై 12 శాతం ఇంటిగ్రేటెడ్​ జీఎస్​టీ అమలులో ఉండేది.

యుటిలిటీ వెహికల్స్ పైనా క్లారిటీ....

యుటిలిటీ వెహికల్స్​పై జీఎస్​టీ అంశంలోనూ జీఎస్​టీ కౌన్సిల్​ స్పష్టత తీసుకొచ్చింది. యుటిలిటీ వెహికల్స్​ డెఫినిషన్​పై ఒక నిర్ణయం తీసుకోవడంతోపాటు, రిజిస్ట్రేషన్​ రూల్స్​ను కూడా కఠినం చేసింది.  ఎంయూవీలపై 22 శాతం కాంపెన్సేషన్​ సెస్​ ప్రపోజల్​ను జీఎస్​టీ కౌన్సిల్​ ఆమోదించింది. కానీ, సెడాన్​లను ఈ లిస్ట్​లో చేర్చలేదు. సెడాన్​లను చేరిస్తే వాటిపై జీఎస్​టీ పెరుగుతుందని పంజాబ్​, తమిళనాడు  అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.ప్రైవేటు కంపెనీలు అందించే శాటిలైట్​ లాంఛ్​ సర్వీసులపైనా జీఎస్​టీ మినహాయంపు ఇవ్వనున్నారు..