
- కొత్త పోస్టులు వేయకపోగా..ఉన్నవి ఊడగొడుతున్న సర్కారు
- ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లతో మొదలైన తొలగింపుల పర్వం
- రోడ్డునపడ్డ హార్టికల్చర్, మిషన్ భగీరథ ఉద్యోగులు
- స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైనా విద్యా వలంటీర్లు,
- గెస్ట్ లెక్చరర్లకు నో రెన్యువల్ బడ్జెట్ లేదనే సాకుతో ఉద్వాసన
- పర్మినెంట్ అయితయనుకుంటే.. తీసేసిన్రు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓ వైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే.. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నది. దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రమని ప్రచారం చేసుకునే ప్రభుత్వం రూ. 10 వేల నుంచి 20 వేల మధ్య జీతం తీసుకునే చిరుద్యోగులను మోయలేని భారంగా భావిస్తున్నది. సమ్మె చేశారని కొందరిని, బడ్జెట్ లేదని మరికొందరిని, పని లేదని ఇంకొందరిని.. ఇట్లా గడిచిన రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 29, 448 మందిని కొలువుల నుంచి తొలగించింది. తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని.. వాళ్లందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఉద్యమ టైంలో కేసీఆర్ హామీ ఇస్తే సంబురపడిన సిబ్బంది.. ఇప్పుడు సర్కారు తీరు వల్ల రోడ్డునపడ్డారు. తెలంగాణ వచ్చి ఏడేండ్లయినా ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా కరోనా కష్టకాలంలో తమను తీసేశారని వాళ్లు గోస పడుతున్నారు. కుటుంబ పోషణకు కూలినాలీ చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథలో వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేసినవాళ్లు ఇప్పుడు కొలువుల్లేక.. ఆటోలు, ట్రాలీలు, కిరాణా షాపులు నడుపుకుంటున్నారు. తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆందోళనలు నిర్వహించినా సర్కారు పట్టించుకోవడం లేదు.
సమ్మెకు దిగిన్రని ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు
ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద గ్రామాల్లో 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్‌ఏలు) పని చేస్తుండేవారు. వీరిలో చాలా మంది సుమారు 14 ఏండ్లుగా డ్యూటీల్లో ఉన్నారు. వీళ్లంతా తమ డిమాండ్ల సాధనకు నిరుడు మార్చి మొదటి వారంలో దశలవారీగా ఆందోళనలు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మార్చి 12న సమ్మె ప్రారంభించారు. కరోనా వ్యాప్తితో 10 రోజుల్లోనే సమ్మె విరమించి డ్యూటీలో చేరడానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ప్రభుత్వం వారిని జాబ్‌లో నుంచి తొలగించింది. సమ్మె టైంలో డ్యూటీ చేసిన 247 మందినే తీసుకున్నారు. వీళ్లతోపాటు మొత్తం 7500 మంది కాంట్రాక్టును రెన్యువల్ చేయలేదు. ఏడాదిన్నర కాలంలో ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటారనే ఆశతో దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుగా ప్రచారం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు.. హుజూరాబాద్‌లో పోటీకి రెడీ అవుతున్నరు.
బడ్జెట్ లేదని హార్టికల్చర్‌లో 500 మంది తీసివేత
హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ అసిస్టెంట్లు, గార్డెనింగ్, కంప్యూటర్ ఆపరేటర్లుగా సుమారు 500 మంది పని చేసేవారు. బడ్జెట్ లేదనే సాకుతో ప్రభుత్వం నిరుడు ఏప్రిల్‌లో కాంట్రాక్టు రెన్యువల్ చేయలేదు.
మిషన్ భగీరథ నుంచి 709 మంది ఇంటికి
బీటెక్, ఎంటెక్ పూర్తిచేసిన 662 మందిని వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా, 47 మందిని జూనియర్ అసిస్టెంట్లుగా మిషన్ భగీరథ పనుల కోసం 2015లో కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది. రేపో, మాపో ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయన్న ఆశతో పనిచేస్తుండగానే.. నిరుడు జులై 1న అందరినీ తొలగించింది.
ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్లకు నో రెన్యువల్
లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లలో 12,400 మంది విద్యా వలంటీర్లు (వీవీలు), సమగ్ర శిక్ష అభియాన్ కింద పని చేస్తున్న 2,500 మంది ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లు(పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్)కు ఇప్పటి వరకు ప్రభుత్వం జాబ్ రెన్యువల్ చేయలేదు. కాలేజీల్లో 1,640 మంది గెస్ట్ లెక్చరర్లు క్లాసులు చెప్తుండేవారు. నిరుడు స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో వీరికి ఉపాధి కరువైంది. అప్పటి నుంచి ‘నో వర్క్.. నో పే’ పద్ధతిలో వీళ్లకు ప్రభుత్వం జీతాలు బంద్ పెట్టింది. నెల రోజుల కింద స్కూళ్లు, కాలేజీలు స్టార్ట్ కావడంతో తమను డ్యూటీలోకి తీసుకుంటారని భావించారు. ఇప్పటికీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు.
హాస్టళ్లలో, ఆర్టీసీలో, సాక్షర భారత్‌నూ...
రాష్ట్రంలోని 2,245 ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ వర్కర్లు సుమారు 1,500 మంది పని చేస్తుండేవారు. ప్రస్తుతం హాస్టళ్లు మూతపడడంతో వీరికి ఉపాధి కరువైంది. ప్రభుత్వం వీరిని రెన్యువల్ చేయడం లేదు. హాస్టళ్లు తెరిచినా.. తమను జాబ్‌లోకి తీసుకుంటారనే నమ్మకం కూడా వారికి లేకుండా పోయింది. కరోనా టైంలో 1,649 మంది స్టాఫ్ నర్సులను తీసుకున్న సర్కారు.. వారినీ అర్ధాంతరంగా తొలగించి రోడ్డునపడేసింది. కరోనా విజృంభించిన సమయంలో ప్రాణాలకు తెగించి పేషెంట్లకు సేవలందిస్తే అవసరం తీరాక తమను తీసేయడం సరికాదని వారు ఆందోళనలు చేసినా సర్కార్ పట్టించుకోలేదు. ఇక, ఆర్టీసీలో పని చేసే 500 మంది ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌ను లాక్ డౌన్ సమయంలో తొలగించారు. వారు చేసే పనులను డ్రైవర్లు, కండక్టర్లకు అప్పగించారు. గ్రామాల్లో పెద్ద వాళ్లకు చదువు చెప్పేందుకు ఉద్దేశించిన సాక్షర భారత్ స్కీమ్ కు సంబంధించిన 550 మంది మండల, జిల్లా స్థాయి కో ఆర్డినేటర్లను ప్రభుత్వం తొలగించింది.
తీవ్ర ఇబ్బందులు పడుతున్నం
రెగ్యులర్ ఉద్యోగుల లెక్కనే నోటిఫికేషన్ ఇచ్చి అర్హతలు ఉంటేనే ఇంటర్వ్యూ చేసి రోస్టర్ పద్ధతిలో ఆర్ట్, క్రాఫ్ట్ పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లను ప్రభుత్వం నియమించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేసిన్రు. కానీ ఇన్నాళ్లూ కనీస వేతన హక్కును అమలు చేయలేదు. తీరా ఇప్పుడు ఉద్యోగాన్నే రెన్యువల్ చేయడం లేదు. రాష్ట్రంలోని 2,500 మంది పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్లు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నం. - ముంజాల శ్రీకాంత్, ఆర్ట్ టీచర్
మిషన్ భగీరథ మొదలైనప్పటి నుంచి ఆ ప్రాజెక్టులో 709 మందిమి పని చేసినం. ప్రాజెక్టు మొదలవక ముందు సర్వే, డీపీఆర్ ప్రిపరేషన్ లోనూ మా కాంట్రిబ్యూషన్ ఉంది. నిరుడు మార్చిలో రెగ్యులర్ చేస్తమని రాత పూర్వక ఆదేశాలూ కూడా ఇచ్చిన్రు. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఒక్కసారిగా నిరుడు జులై 1న తీసేసిన్రు. మమ్మల్ని ఇరిగేషన్ లోనైనా కొనసాగించాలని కోరుతున్నం. - వినయ్ కుమార్, మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ లీడర్
ఉపాధి హామీ పథకంలో 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నరు. వీళ్లలో 5 వేల మంది 14 ఏండ్లుగా పని చేస్తున్నవాళ్లే. రాష్ట్రమొస్తే ఉద్యోగాలు పర్మినెంట్ అయితయనుకున్నం. సమస్యలపై సమ్మెకు వెళ్లి.. కరోనా పరిస్థితులను అర్థం చేసుకుని 10 రోజుల్లోనే విరమించినం. సమస్యలు పరిష్కరించకపోగా.. మమ్మల్ని ప్రభుత్వం తొలగించింది. ఫీల్డ్ అసిస్టెంట్లలో 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. వాళ్లంతా రోడ్డునపడ్డరు. – శ్యామలయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ప్రెసిడెంట్