ఐపీఎల్ మ్యాచ్ ల‌పై 29న‌ క్లారిటీ..?

ఐపీఎల్ మ్యాచ్ ల‌పై 29న‌ క్లారిటీ..?

ముంబై: క్రికెట్ అభిమానుల‌కు మాంచి కిక్కునిచ్చే ఐపీఎల్ ఈ సారి క‌రోనా కార‌ణంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ప‌ట్నుంచీ ఫేస్-2 మ్యాచ్ ల‌ను ఎప్పుడు..ఎక్క‌డ నిర్వ‌హిస్తార‌నేదానిపై ఎన్నో సందేహాలు వ‌స్తున్నాయి. క‌రోనా త‌గ్గుముఖం ప‌డ్డాక ఇండియాలోనే మ్యాచ్ లు ఉంటాయ‌ని..లేదంటే దుబాయ్ లోజ‌రుగుతాయ‌ని చెప్పుకుంటున్నారు. క‌రోనా బారిన‌ప‌డ్డ క్రికెటర్లు కూడా కోలుకుంటుండ‌గా.. మిగ‌తా మ్యాచ్ ల‌పై బీసీసీఐ కూడా ఓ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే  ఐపీఎల్ 2021 మ్యాచ్‌ల‌ను(ఫేస్‌-2) సెప్టెంబ‌ర్ లో నిర్వహించే అవ‌కాశాలున్నట్లు స‌మాచారం. ఐపీఎల్ లో మొత్తం 60 మ్యాచ్ లు జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా 29 మ్యాచ్ లు మాత్రమే జ‌రిగాయి.  దీంతో మిగిలిన 31 మ్యాచ్ లను యూఏఈ వేదికగా సెప్టెంబ‌ర్ 15 నుంచి అక్టోబ‌ర్ 15 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంద‌ట‌.

ఈ మేరకు మే- 29న జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. యూఏఈ వేదికగా ఇదివరకే రెండు ఐపీఎల్‌ సీజన్లు (2020, 2014) జరిగాయి. భారత్ లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2014 లీగ్ లో మొదటి 20 మ్యాచ్ లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. కరోనా కారణంగా 2020 సీజన్ కూడా యూఏఈలోనే పూర్తయింది. దీంతో ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లను కూడా ఆ దేశంలోనే నిర్వహించేందుకు బీసీసీఐ ఇంట్రెస్ట్ చూపుతోందట‌. అక్టోబర్ లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌ దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ ను ఎలాగైనా పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోందట‌. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఈ నెల 29న తెలుస్తుంది.