కల్వర్టును ఢీకొట్టిన కారు..ముగ్గురు అయ్యప్ప స్వాములు మృతి

కల్వర్టును ఢీకొట్టిన కారు..ముగ్గురు అయ్యప్ప  స్వాములు మృతి

 

  • శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం
  • మృతులది ములుగు జిల్లా కమలాపురం గ్రామం
  • ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

మంగపేట (ములుగు), వెలుగు: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప స్వాములు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కేరళలోని శబరిమలైలో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఆదివారం ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన తలారి సుబ్బయ్య నాయుడు, నర్ర సాంబయ్య, నిమ్మల వెంకట్రాజు, కూనారపు అజయ్, జర్పుల రాములు మాల విరమణ కోసం గురువారం రెండు కార్లలో శబరిమలై వెళ్లారు. మొక్కులు చెల్లించుకుని, మాల విరమణ చేసి స్వగ్రామానికి బయలుదేరారు. తమిళనాడులోని తేని జిల్లా దేవదానపట్టి గ్రామం వద్దకు చేరుకోగానే.. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనతో కారులో ప్రయాణిస్తున్న సుబ్బయ్య నాయుడు (52), నర్ర సాంబయ్య (55), నిమ్మల వెంకట్రాజు (49) స్పాట్​లోనే చనిపోయారు. అజయ్, రాము తీవ్రంగా గాయపడటంతో దేవదానపట్టిలోని మెడికల్ కాలేజీకి తరలించి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. వీరిలో రాము పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

తేని మెడికల్ కాలేజ్​లో ట్రీట్​మెంట్

కుటుంబ సభ్యుల సమాచారంతో ఏటూరునాగారం సీఐ రాజు, స్థానిక ఎస్ఐ గోదారి రవికుమార్.. తమిళనాడులోని దేవదానపట్టి పోలీసులతో మాట్లాడారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. కాగా, రెండో కారులో ప్రయాణిస్తున్న వేణు, వంశీకృష్ణ, పడ్డా శ్రీను కలిసి తేని మెడికల్ కాలేజీలోనే ఉండి గాయపడిన వారికి ట్రీట్​మెంట్ చేయిస్తున్నారు. అక్కడి పోలీసుల సహకారంతో డెడ్​బాడీలను కమలాపురం గ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మాల విరమణ కోసం శబరిమలకు..

సుబ్బయ్య నాయుడు 17వ సారి అయ్యప్పమాల వేసుకున్నారు. అయ్యప్ప మాలధారణ, పూజల్లో సుబయ్య నాయుడే కీలకంగా వ్యవహరించేవారని స్థానికులు తెలిపారు. మానవ హక్కుల సంఘంలో రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. సుబ్బయ్యకు భార్య పార్వతి, ఇద్దరు కూతుళ్లు తేజశ్విని, సాత్విక ఉన్నారు. ఇక, వెంకట్రాజు కమలాపురంలోని గుడ్డేలుగులపల్లిలో చిన్న కిరాణ షాపు నడుపుకుంటున్నాడు. ఇతను ఫస్ట్ టైమ్ మాల వేసుకున్నాడు. అందుకే మాల విరమణ కోసం శబరిమల వెళ్లాడు. వెంకట్రాజుకు భార్య కాత్యాయణి, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. బిడ్డలకు పెండ్లిళ్లు కాగా, కొడుకు దుర్గాప్రసాద్ లండన్ లో చదువుతున్నాడు. మరో మృతుడు.. నర్ర సాంబయ్య ఐదోసారి మాల ధరించాడు. వృత్తిరీత్యా రైతు అయిన ఈయనకు.. వరికోత మిషన్ ఉంది. సాంబయ్యకు భార్య శివకుమారి, ఇద్దరు కొడుకులు ఉన్నారు.