ఉద్యోగం ఊడితే ఊడింది..మాకు మా కంఫర్టే ముఖ్యం: ఉద్యోగంలో మూడు తరాలు

ఉద్యోగం ఊడితే ఊడింది..మాకు మా కంఫర్టే ముఖ్యం: ఉద్యోగంలో మూడు తరాలు

కొత్త సంవత్సరం వచ్చేసింది.

నిజానికి ఇది కొత్త దశాబ్దం కూడా.

ఒక దశాబ్దం నుంచి ఇంకో దశాబ్దానికి మనం మారుతున్నప్పుడు మన ఆలోచనలు, పద్ధతులు చాలా మారిపోతుంటాయి.

ఇవ్వాళ ఈ కవర్‌స్టోరీ కూడా సరిగ్గా ఇలాగే ఒక తరం నుంచి ఇంకో తరానికి మారుతున్నప్పుడు ఆలోచనలు కూడా ఎలా మారుతున్నాయో చెప్తుంది!

ముఖ్యంగా ఉద్యోగం విషయంలో ఇప్పుడున్న తరం, వాళ్లకు ముందు తరం, వాళ్లకంటే ముందున్న తరం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎలా ఉంటున్నాయి? ఉద్యోగంలో వాళ్లు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అనే విషయాల గురించిందే ఈ స్టోరీ.

‘ఎహెయ్‌‌.. నేను ఈ జాబ్‌‌ చెయ్యనురబై’ అని చాలా మామూలు విషయాలకు కూడా అనేటోళ్లను మనం చూస్తుంటం.

‘ఇంత చిన్నదానికి ఉద్యోగం మానేస్తరా!’ అని కొంచెం పెద్దోళ్లు సముదాయిస్తుంటరు. ‘ఇట్లయితే ఎట్ల చెప్పు’ అని నచ్చ చెప్తానికి చూస్తరు. ఎందుకంటే వాళ్లు చిన్న చిన్న విషయాలకు ఉద్యోగాలు వదిలినోళ్లు కాదు.

అంతకుముందు కాలంల అయితే పని దొరుకుడే కష్టం మరి. ‘ఒక జాబ్‌‌ వస్తే ఎంత బాగుండో’ అని నెలలకు నెలలు రోడ్డు మీద పడి, కాళ్లు అరిగేలా తిరిగి ఎట్లనో అట్ల జాబ్‌‌ కొట్టి, దానికే అతుక్కపోయేటోళ్లు. ఒక ఇంట్లనే.. తాత కాలంల, తండ్రి కాలంల, ఇప్పుడిప్పుడే ఉద్యోగంలకి ఎక్కిన కొడుకు కాలంల.. ఉద్యోగాన్ని చూసే తీరు, పద్ధతి మారింది. ఈతరం ఏ చిన్న సమస్య వచ్చినా, కంఫర్ట్‌‌ లేకపోయినా లేట్‌‌ చెయ్యకుండా, ‘నేను ఈ జాబ్‌‌ మానేస్తున్న!’ అంటున్నరు.

ఎందుకు ఈ మూడు జనరేషన్స్‌‌ మధ్య ఇంత మార్పు? ఒక్కసారి అన్ని జనరేషన్స్‌‌ని పలకరించి వద్దాం!

తెలుగులో ‘కిక్‌‌’ అని ఒక సూపర్‌‌హిట్‌‌ సినిమా వచ్చింది గుర్తుంది కదా! అందులో హీరో తనకు నచ్చిన పని మాత్రమే చేస్తుంటాడు. ఏదైనా ఉద్యోగం తనకు బోర్‌‌ కొట్టినా, పెద్దగా కిక్కివ్వకపోయినా వెంటనే ఆ ఉద్యోగాన్ని వదిలేస్తుంటాడు. ఆ కంటెంట్‌‌కి జనం బాగా కనెక్ట్‌‌ అయ్యారు. ఇదే కథను హిందీ, తమిళంలో కూడా సినిమాలుగా తీసి హిట్‌‌ కొట్టారు.

ఆ తర్వాత దీనికి సీక్వెల్‌‌ ‘కిక్‌‌ 2’ వచ్చింది. ఈ సినిమాలో హీరో ‘కిక్‌‌’ సినిమాలో ఉన్న హీరోకి కొడుకు. తండ్రికి కిక్‌‌ కావాలి, కొడుక్కి కంఫర్ట్‌‌ కావాలి. తనకు కావాల్సిన, తాను కోరుకున్న పరిస్థితులు ఉన్నచోట మాత్రమే అతనుంటాడు. అక్కడ మాత్రమే బతకాలనుకుంటాడు. తన కంఫర్ట్‌‌ జోన్‌‌ లోపలికొస్తే మాత్రం ఊరుకోడు. సరిగ్గా ఈ జనరేషన్‌‌ ఈ ఫేజ్‌‌లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. తాము చేసే ఉద్యోగం తమ కంఫర్ట్‌‌లో ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం కలిగినా ఆ ఉద్యోగాన్ని వదలడానికి కూడా కొంతమంది వెనకాడటం లేదు. మరి ఒకప్పుడు ఇలాగే ఉందా? లేదు.

ఒకప్పుడు.. చేస్తున్న సంస్థలోనే సంవత్సరాల తరబడి పనిచేసి రిటైర్‌‌ అవ్వడం.. సంస్థను వదిలేయాల్సిన అవసరం కచ్చితంగా ఉంటే తప్ప వదలకపోవడం.. ఇలాంటివి ఉండేవి.

జనరేషన్‌‌ గ్యాప్‌‌ అన్నది ఆలోచనలు, వేసుకునే బట్టలు, మాట తీరు.. ఇక్కడే కాదు, ఉద్యోగాలను చూసే తీరులో కూడా ఉంది. ఒక్కో జనరేషన్‌‌కి ఆ గ్యాప్‌‌ ఎలా ఉందో చూద్దాం.

పద్దెనిమిదో శతాబ్దానికి  ముందు ప్రపంచంలో దాదాపు అందరూ రాజులకు పన్నులు చెల్లిస్తూ  వ్యవసాయం చేసుకునేవారు. ఎక్కువమంది రైతు కూలీలే. వ్యవసాయానికి అనుబంధంగా కొన్ని  కుల వృత్తులు. అంతే! కూడు, గుడ్డ ఈ రెండూ ఉంటే చాలు అన్నట్టు ఉండేది  పరిస్థితి. 18వ శతాబ్దంలో బ్రిటన్‌‌లో వచ్చిన ఇండస్ట్రియల్‌‌ రెవల్యూషన్ ప్రపంచ ముఖ చిత్రాన్నే మార్చేసింది. కొత్త ఆలోచనలు, కొత్త యంత్రాలు, కొత్త పద్ధతులు రావడంతో వనరులను మరింత చక్కగా వినియోగించడం మొదలైంది. అప్పటివరకు నత్తనడకగా సాగిన మానవాభివృద్ధి.. ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌‌తో ఒక్కసారిగా స్పీడందుకుంది.

‘వ్యాపారం’ అనే ఆలోచన పుట్టినప్పుడే.. ‘ఉద్యోగం’ అనే అవసరం కూడా పుట్టింది.  లాభాలను మనసులో ఉంచుకొని రకరకాల ఉద్యోగాల్ని డిజైన్ చేశారు.

ఇండస్ట్రియల్ రెవల్యూషన్..

18వ శతాబ్దంలో  జనాభాతో పాటు అప్పటి మూలవనరు అయిన కలపకూ డిమాండ్ పెరిగింది. అడవులను నరికి.. కలపను, గుర్రం, ఎడ్ల బండ్లలో పట్టణాలకు ఎగుమతి చేసేవారు.  రవాణా చేయడం చాలా కష్టంగా ఉండేది. బ్రిటన్‌‌లో అప్పుడు కొత్త ఫ్యూయల్ కోసం అన్వేషణ మొదలైంది. దానిలో భాగంగానే.. బొగ్గు దొరికింది.  గనుల్లో బొగ్గు తవ్వి యూరప్‌‌లో అమ్మడం మొదలుపెట్టింది బ్రిటన్. ఆ తర్వాత క్రమంగా స్టీమ్‌ ఇంజన్‌ కనిపెట్టాక మొత్తం ప్రపంచమే మారిపోయింది.

అప్పుడే మొదలైంది!

యంత్రాలు స్టీమ్‌‌ ఎనర్జీతో పనిచేస్తాయని తెలుసుకున్నాక అనేక రకాల యంత్రాలు వస్త్ర పరిశ్రమ, మైనింగ్‌‌లోకి వచ్చాయి. నెమ్మదిగా చేతి వృత్తుల నుంచి మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్‌‌ వైపు మళ్లాయి. పద్దెనిమిది, పందొమ్మిదో  శతాబ్దంలో  సైంటిస్టులు కొత్త కొత్తవి ఎన్నో కనిపెట్టారు. ఆ స్టీమ్ ఇంజిన్‌‌తోనే ఓడలు, లోకోమోటివ్స్‌‌ నడిపారు. తర్వాతి కాలంలో కనిపెట్టిన రైలు మార్గం.. ప్రపంచ చరిత్రలో గొప్ప మలుపురాయిగా మారిపోయింది. సరుకు రవాణా ఇంకా సులభంగా మారింది. అలా  ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత అన్ని రకాల గూడ్స్ తయారుచేసే మ్యానుఫ్యాక్చరింగ్‌‌ ఫ్యాక్టరీలు వరుసగా వచ్చాయి. ఊళ్లల్లో చేతి వృత్తులు పడిపోవడంతో.. అంతా ఉద్యోగం కోసం పట్టణాల్లో వెలిసిన ఫ్యాక్టరీలకు వలసపోయారు.

బ్రిటన్‌‌ నుంచి ప్రపంచానికి..

ఇండస్ట్రియల్‌‌ రెవల్యూషన్‌‌కి చాలా పెట్టుబడి అవసరమైంది. బ్రిటిష్ సామ్రాజ్యం తన వ్యాపారం పెంపొందించుకోవడంలో రాయల్ నేవీ ముఖ్య పాత్ర పోషించింది. వివిధ దేశాల నుంచి రకరకాల వనరులను నేవీ బ్రిటన్‌‌కి తీసుకొచ్చేది. అలా చిన్న దేశమైన బ్రిటన్.. ‘రిచెస్ట్ కంట్రీ’గా మారింది.

సంపద పెరగడంతో అక్కడ బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజెస్‌‌ వచ్చాయి. చాలామంది లైఫ్ స్టైల్‌‌ మెరుగైంది. మిడిల్‌‌క్లాస్‌‌ వాళ్లు పెరిగిపోయారు. అప్పటివరకు  ఇంటి సామాన్లు… లోకల్‌‌గా ఉండేవాళ్లు తయారుచేసి, లోకల్ మార్కెట్‌‌లోనే అమ్మేవారు. కానీ, ఇండస్ట్రియల్‌‌ రెవల్యూషన్ తర్వాత లండన్‌‌లో  షాప్స్ ఓపెన్‌‌ అయ్యాయి.  ఫ్యాషన్ షోరూమ్‌‌లు వచ్చాయి.  రోడ్లు వేసి.. ప్రజల నుంచి టోల్‌‌ తీసుకోవచ్చంటూ బిజినెస్‌‌మెన్‌‌కి అనుకూలంగా బ్రిటన్ పార్లమెంట్ ఒక బిల్లు తీసుకొచ్చింది. ఇలా అన్ని విధాలా అభివృద్ధి సాధించింది బ్రిటన్‌‌. అచ్చంగా ఇలాగే, అమెరికా కూడా బ్రిటన్‌‌ని అనుసరించి సైంటిస్టులకు పెట్టుబడి పెట్టే స్వేచ్ఛని ఇవ్వడంతో అక్కడ కూడా కొత్త కొత్తవి ఎన్నో కనిపెట్టారు. 20వ శతాబ్దం నాటికి అమెరికా కూడా బ్రిటన్‌‌ స్పీడ్‌ని అందుకుంది. అలా బ్రిటన్‌‌ నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యూరప్‌‌కి, అమెరికాకు, అటు నుంచి ప్రపంచమంతా పాకింది. బ్రిటన్‌‌లో పరిస్థితులకు కొంచెం అటూ ఇటూగా ప్రపంచమంతా ఈ పరిస్థితే కాపీ అయింది!

సంపద వెనక బానిసలు

ఈ సంపదంతా మనిషిని పణంగా పెట్టి సృష్టించారనడంలో సందేహం లేదు. కోట్లాదిమంది బానిసలు దీనికోసం పని చేశారు. స్వేచ్ఛా వ్యాపారంలో భాగంగా.. స్వేచ్ఛగా బానిసల్ని కొనుగోలు చేసే అవకాశాన్ని బ్రిటన్‌‌ పార్లమెంట్ వ్యాపారులకు కల్పించింది. ఆఫ్రికన్ రూలర్స్ బ్రిటన్‌‌కి ఎంతోమంది బానిసల్ని అమ్మేవారు. అట్లాంటిక్ సముద్రం మీదుగా వాళ్లను బ్రిటన్‌‌కి తరలించేవారు. అప్పుడు నల్ల జాతివాళ్లను మనుషుల్లా కాకుండా,  వ్యాపారానికి ఉపయోగపడే సహజ వనరులుగా భావించేవారు.  కేవలం18వ శతాబ్దంలోనే 25 లక్షల మంది బానిసల్ని బ్రిటిష్ గవర్నమెంట్ రవాణా చేసింది.  బానిసలు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసేవారు.

మిలినియర్స్  ఏమంటున్నరు?

1980 నుంచి 1999 మధ్య  పుట్టిన వాళ్లంతా మిలెన్నియల్స్. వీళ్లనే జనరేషన్ ‘వై’ అని కూడా పిలుస్తుంటారు. జనాభా పరంగా చూసినా ఉద్యోగాల్లో చూసినా ఎక్కువమంది ఈ జనరేషన్‌‌ వాళ్లే కనిపిస్తారు.

ఇరవైల్లోనే వీళ్లు వర్క్‌‌ప్లేస్‌‌కి వస్తున్నారు. ఎవరు ఎక్కువ జీతం ఇస్తే అటువైపు వెళ్లిపోతున్నారు. మిలెన్నియల్స్‌‌కి వర్క్ కల్చర్ చాలా ముఖ్యం. ఎక్కడైతే వాళ్లకు సహాయ సహకారాలు అందుతాయో, ఎక్కడ అందరూ కలిసి పనిచేస్తారో అలాంటి వాతావరణాన్నే వీళ్లు ఇష్టపడుతున్నారు. లేటెస్ట్‌‌ టెక్నాలజీతో కనెక్ట్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్‌‌ని డిమాండ్ చేస్తున్నారు. అవకాశం కల్పిస్తే  దేన్నైనా నేర్చుకోవడానికి వీళ్లు సిద్ధంగా ఉంటారు.

టాలెంట్‌‌ని గుర్తించాలని, మంచి జీతం ఇవ్వాలని కోరుకుంటారు. ఇంకో చోట మంచి అవకాశం ఉంటే అప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి పోవడానికి ఎక్కువ ఆలోచించరు. ఇది అందరి విషయంలోనూ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. కొంతమంది తల్లిదండ్రులు, తాతలు ఎవ్వరూ చదువుకొని ఉండరు. తామే చదువుకున్న జనరేషన్‌‌ అయితే, వీళ్లు ఉద్యోగాల విషయంలో పాత జనరేషన్‌‌లాగానే ఉంటున్నారు. కొంచెం డబ్బున్న మిగతావాళ్లతో పోల్చితే వీళ్లు ఉద్యోగం విషయంలో రిస్క్‌‌ తీసుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు కంఫర్ట్‌‌ లేకపోయినా సర్దుకుపోతుంటారు.

పగలంతా పనే!

కాటన్ మిల్స్‌‌, కోల్‌‌ మైన్స్ ఓనర్స్‌‌తో పాటు  మిడిల్‌‌ క్లాస్‌‌ వాళ్లు లగ్జరీ లైఫ్‌‌స్టైల్‌‌ అనుభవించేవాళ్లు. వర్కింగ్‌‌ క్లాస్‌‌ ప్రజలంతా బానిసల్లా పని చేసేవారు. పనిముట్ల స్థానంలో  కొత్త మెషిన్లు రావడంతో  ఉత్పత్తి ఇంటి నుంచి ఫ్యాక్టరీలకు మారింది. అప్పటివరకు ఇంటి దగ్గరే ఉత్పత్తి చేసిన వస్తువుల్ని వ్యాపారులకు ఇచ్చే విధానం పోయి.. ఫ్యాక్టరీలకు వచ్చి పని చేయాల్సి వచ్చింది. దాంతో  వ్యాపారులు.. శ్రామికుల మీద పూర్తి అధికారాన్ని సంపాదించారు. దాన్నే ‘ఉద్యోగం’ అని పిలిచారు. ప్రపంచవ్యాప్తంగా గూడ్స్‌‌కి డిమాండ్‌‌ పెరగడంతో పందొమ్మిదో శతాబ్దంలో ఫ్యాక్టరీల్లో కార్మికుల అవసరం బాగా పెరిగిపోయింది. దాంతో  మహిళలు, చిన్నపిల్లలతో కూడా పని చేయించడం మొదలుపెట్టారు. కుటుంబమంతా ఫ్యాక్టరీలోనే ఉండేదన్నమాట!

వర్కింగ్‌‌ కండిషన్స్‌‌

ఇండస్ట్రియల్‌‌ రెవల్యూషన్ కాలంలో ఫ్యాక్టరీలు దుమ్ముతో, డిమ్ముగా, ప్రమాదకరంగా ఉండేవి. వర్కర్స్ జీర్ణాశయ, ఊపిరితిత్తుల వ్యాధులతోపాటు రకరకాల నొప్పులతో బాధపడేవాళ్లు.  చేతులు, కాళ్లకు కాయలు కాసేవి.  జీతాలు చాలా తక్కువ ఉండేవి. ఫ్యాక్టరీలో చిన్నతప్పు చేసినా.. జీతం కట్‌‌ చేసేవాళ్లు. పిల్లలు తప్పులు చేస్తే.. కొట్టేవాళ్లు.   ఒక్కో కోల్‌‌మైన్‌‌లో  రోజుకు సగటున ఒకరు చొప్పున చనిపోయేవారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌‌లో ఉద్యోగులు  కనీస అవసరాలు.. అంటే తిండి, బట్టలు సరిగ్గా ఉంటే చాలు, అవి సరిగ్గా ఉంటే ఒక ఇల్లు. ఇంతకన్నా ఎక్కువ ఆలోచించేవారు కాదు.

బాస్ తిట్టినా, కొట్టినా సడీ చప్పుడు చేయకుండా పని చేయడమే వాళ్లకు తెలుసు. ఆ కాలంలో బాస్ ఏం చెప్తే అదే రైట్‌‌ అని…  వాళ్లు చెప్పినట్టు చేసేవాళ్లు. తట్టుకోలేక రిజైన్‌‌ చేయాలనిపించినా  ఇల్లు, కుటుంబం గుర్తుకొచ్చి ఆ ఆలోచన అణిగిపోయేది. ఇల్లు గడవాలంటే.. నెలనాడు జీతం పడాల్సిందే. వేరే దగ్గర పని చేద్దామన్నా.. అవకాశాలు  ఉండేవి కాదు. అందుకే,  ఎవరేం చేసినా.. ఏం అన్నా ఆ ఫ్యాక్టరీని విడిచిపెట్టేవాళ్లు కాదు.  వీళ్లకు ఓపిక చాలా ఎక్కువ. అరవై ఏళ్లు అదే కంపెనీలో పనిచేసి రిటైర్‌‌ అయ్యేవాళ్లు. కేవలం ఆదివారం మాత్రమే సెలవు. ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌‌లో ఉద్యోగుల పరిస్థితి మూడు ముక్కల్లో  చెప్పాలంటే  పూర్ వర్కింగ్ కండిషన్స్, హార్డ్ వర్క్ , తక్కువ జీతం!

ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్..

కొన్ని రోజుల్లో చేసే పనిని కొన్ని గంటల్లో పూర్తి చేయడానికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణమైతే.. కొన్ని గంటల్లో చేసే పనిని.. నిమిషాల్లో చేయడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  రెవల్యూషన్‌‌తో సాధ్యమైంది! 1960లో ఐటీ రెవల్యూషన్‌‌కి పునాదులు పడ్డాయి. 1991 నాటికి  ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల కంప్యూటర్లు వాడకంలోకి వచ్చాయి. అది వంద కోట్లకు చేరడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ వల్ల ఎలక్ట్రానిక్స్‌‌, కంప్యూటింగ్, టెలికమ్యూనికేషన్స్‌‌లో ఊహించని మార్పులు వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌, ఫిఫ్త్‌‌ జనరేషన్ సూపర్‌‌‌‌ కంప్యూటర్స్ అందుబాటులోకి రావడంతో స్కూళ్లు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, బ్యాంకులు, షాప్స్‌‌, హాస్పిటళ్లలో ఐటీ వాడకంతో స్మార్ట్‌‌గా తయారయ్యాయి. ఐటీ కంపెనీలు మనిషి జీవితాన్ని ఇంకా ఈజీగా మార్చేశాయి.

లైఫ్‌‌స్టైల్‌‌ మారింది

ఐటీ రెవల్యూషన్ తర్వాత వర్క్‌‌ప్లేస్‌‌లో పరిస్థితులు మారిపోయాయి. వర్క్‌‌ప్లేస్‌‌ పరిసరాలు క్లీన్‌‌గా మారాయి. స్కిల్స్‌‌  ఆధారంగా ఉద్యోగాలు రావడం మొదలైంది. పనివేళల్లో మార్పులు వచ్చాయి. జీతాలు కూడా భారీగా పెరిగాయి.  1961నుంచి 1981మధ్య పుట్టిన వాళ్లు జనరేషన్ ‘ఎక్స్’ కిందికి వస్తారు. వీళ్లు వర్క్‌‌ప్లేస్‌‌కి వచ్చేవరకు ఐటీ రెవల్యూషన్ వచ్చేసింది. తమ ముందుతరం హార్డ్‌‌వర్క్ చేసి ఎలా అలిసిపోయేవారో, ఫ్యామిలీకి కూడా టైమ్‌‌ కేటాయించలేని వాళ్ల దీనస్థితిలో ఎలా గడిపేవారో  వీళ్లు దగ్గరుండి చూశారు. అందుకే, తమ ముందు తరాల్లాగా పని చేయడానికి వీళ్లు ఇష్టపడలేదు. కేవలం కూడు, గుడ్డతో సరిపెట్టుకోకుండా మంచి స్టాండర్డ్స్‌‌తో కూడిన జీవితాన్ని కోరుకున్నారు. వర్క్‌‌–-ఫ్యామిలీ బ్యాలెన్స్‌‌ని కోరుకున్నారు.  ఉద్యోగం కంటే సొంతంగా వ్యాపారం చేసుకోవడమే ఉత్తమం అనే భావన వీళ్లలో ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు ఉన్న స్టార్టప్స్‌‌లో  50 శాతం ఈ జనరేషన్‌‌ ప్రారంభించినవే కావడం విశేషం. ఏదో ఒక గొప్ప విజయం సాధించాలనే తపన ఈ జనరేషన్‌‌లో కనిపిస్తుంది. వీళ్లు పూర్తిగా గోల్‌‌ ఓరియెంటెడ్‌‌ అనే పేరుంది.  సంస్థ పట్ల విశ్వాసంతో పనిచేస్తారు. ఉద్యోగంలో గుర్తింపుని, రివార్డ్స్‌‌ని కోరుకున్నారు.  అర్హతకు తగ్గట్టు ప్రమోషన్స్‌‌  వస్తాయి కానీ, ర్యాంక్‌‌, వయసు బట్టి రావని వీళ్లు నమ్ముతారు. మంచి జీతం ఉండటం వల్ల  కారు‌‌ ఈఎంఐ, ఇల్లు ఈఎంఐ, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం ఈ జనరేషన్‌‌తో ప్రారంభమైంది. ప్రమాణాలతో కూడిన జీవితమే వీళ్ల ఉద్యోగం వెనకున్న లక్ష్యం. ఒక కంపెనీ మారాలంటే వీళ్లు చాలా ఆలోచించేవారు.

సోషల్ రెవల్యూషన్

2008 ఆర్థిక మాంద్యం తర్వాత సోషల్ రెవల్యూషన్ లేదా డిజిటల్ రెవల్యూషన్ మొదలైంది. కథ కంప్యూటర్ నుంచి స్మార్ట్‌‌ఫోన్‌‌కి చేరింది. ఇప్పుడు  సమాచారం  ఉచితంగా లభిస్తోంది. కష్టమైన కోడింగ్‌‌  కూడా యూట్యూబ్‌‌లో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం సోషల్‌‌ రెవల్యూషన్‌‌లో జీవిస్తున్నాం. ఇప్పటి ఉద్యోగులు బతకడం గురించి ఆలోచించడం లేదు. వీళ్లకు చాయిస్‌లు చాలా ఎక్కువ. ఈ జనరేషన్ ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ కావాలంటోంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే.. మంచి ఉద్యోగం, పనిచేసే చోట  ఆహ్లాదకరమైన వాతావరణం, టాలెంట్‌‌కి తగ్గ రోల్‌‌, కొత్త విషయాలు నేర్చుకోవడానికి,  ఎదగడానికి కావాల్సిన అవకాశాలు వర్క్‌‌ప్లేస్‌‌లో ఉండాలని కోరుకుంటోంది.  అలాగే, తమ పనికి తగిన గుర్తింపు, రివార్డ్స్  కావాలంటోంది.  ఇవన్నీ ఇస్తే..  ఆ సంస్థ కోసం ఎంత రిస్క్ తీసుకునైనాగానీ, పని చేయడానికి సిద్ధంగా ఉంటారని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. అయితే ఇప్పటి జనరేషన్‌‌కి విశ్వాసం అంటే ఏంటో తెలియదనే విమర్శలు ఉన్నాయి. వీళ్లకు బాధ్యత కావాలి, దానికి తగ్గ రివార్డూ కావాలి. మిలెన్నియల్స్‌‌కి ఉద్యోగం చేయకుంటే గడవదు అనే పరేషాన్ లేదు. అందుకే నచ్చకపోతే ఉద్యోగాలు, సంస్థలు మారడానికి వెనుకాడటం లేదు.

ఆ కంఫర్ట్‌‌ కావాలి!

విశ్వాసం ఉండదు, విలువలతో సంబంధం లేదు అన్న విమర్శలు ఉన్నా కూడా ఈతరం మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. మిలెన్నియల్స్‌‌ని ‘ఉద్యోగం ద్వారా ఏం కోరుకుంటున్నారు?’ అనడిగితే, ఆ ఉద్యోగం తమ టాలెంట్‌‌ని నిరూపించుకునే అవకాశాన్ని ఇవ్వాలంటారు. అలాగే తమకు కావాల్సిన కంఫర్ట్‌‌ దొరకడం చాలా ఇంపార్టెంట్‌‌ అని చెప్తారు. ఈ కంఫర్ట్‌‌ని ముందుతరం కోరుకోలేదా అంటే కోరుకుందేమో కానీ, ఎక్కువగా సంస్థ కోసం విశ్వాసంగా పనిచేయడం, బయటికి వెళ్తే ఏమవుతుందో అన్న అనుమానంలోనే బతికారు. ఈ జనరేషన్‌ మాత్రం బయటికెళ్తే ఏమవుతుందో, కొత్త ఉద్యోగం దొరుకుతుందో లేదోనన్న ఆలోచన లేకుండా ఉద్యోగాన్ని వదిలేయగలుగుతున్నారు. పని అన్ని జనరేషన్స్‌‌లో వాళ్లు చేసినా, స్మార్ట్‌‌గా, నచ్చినట్టు పనిచేయడం కదా ఇంపార్టెంట్‌‌ అంటున్నారు వీళ్లు. మొత్తం ప్రపంచాన్నే.. మిలెన్నియల్స్‌‌ మార్చింది తమ ఆలోచనల నిండా నింపుకున్న ఈ యాటిట్యూడ్‌‌తోనే!

– గణేశ్‌ తండ

అప్పుడు.. ఇప్పుడు.. ఏం మారిందంటే..!

మనం పనిచేస్తున్న చోట ఐదారేళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. కొత్త వ్యక్తులు, కొత్త టెక్నాలజీ రావడంతో పనిచేసే చోట చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు కూడా కొత్త కంఫర్ట్స్‌‌లో భాగమే. ఒక పెద్ద ఆఫీస్‌‌లో ఏసీ పనిచేయడం లేదని ఎంప్లాయి ఉద్యోగం మానేశాడు. వర్క్‌‌ ప్లేస్‌‌లో ఇలాంటి కంఫర్ట్స్‌‌ ఈతరం బాగా కోరుకుంటోంది. ఆ కంఫర్ట్స్‌‌ ఎలాంటివో చూడండి!

బాస్‌‌ అంటే ఎవ్వరికీ కనిపించకుండా, ఎవ్వరితో మాట్లాడకుండా, అందరిపై అరిచే పరిస్థితే ఒకప్పుడు ఉండేది. అయితే ఈ తరం ఎంప్లాయిస్‌‌ మాత్రం అలాంటి బాస్‌‌లను ఇష్టపడటం లేదు. చాలాచోట్ల ఇప్పుడున్న బాస్‌‌లు కూడా అందరిలో కలిసిపోయేవాళ్లే వస్తున్నారు. ఏదైనా విషయం గురించి చర్చించడానికి బాస్‌‌ అందుబాటులోనే ఉంటున్నారు. ‘ఫ్రెండ్లీ బాస్‌‌’ అన్నది ఈ తరం ఉద్యోగులు కోరుకుంటున్న ఒక కంఫర్ట్‌‌.

ఒకరోజు ట్రాఫిక్‌‌ ఎక్కువ ఉంటుంది, ఒకరోజు భారీ వర్షం, ఒకరోజు ఒంట్లో బాగుండదు. ఇలాంటప్పుడు కూడా ఆఫీసులకి వెళ్లడం కుదరకపోవచ్చు. దీనికి ‘వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌’ అనే ఒక కంఫర్ట్‌‌ కనిపెట్టుకుంది ఈ జనరేషన్‌‌. ఆఫీసులో చేసే పనే ఇంటినుంచి చెయ్యడం అన్నమాట. అవసరంలో ఉన్నప్పుడు ‘వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌’ ఫెసిలిటీ ఇవ్వకుంటే ఇంకెందుకు? అంటున్నారు.

ఎంతసేపు పనిచేస్తున్నామన్నది కూడా ఈ జనరేషన్‌‌ చూసుకుంటోంది. ఒకప్పటిలా ఎనిమిది గంటలు దాటినా పనిచేయాలంటే కండిషన్స్‌‌ పెట్టడానికి వెనుకాడరు. ‘అవసరం ఉన్నప్పుడు ఉంటాం కానీ, ప్రతిసారీ ఎక్కువ గంటలు పనిచెయ్యాలంటే మాత్రం మా వల్ల కాదు’ అని ఈ జనరేషన్‌‌ చెప్తోంది. ఇది నిజానికి ఒక కంఫర్ట్‌‌. ఉద్యోగం మారడానికి, మారేముందు చాలామంది ఈ విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు.

లంచ్‌‌ బ్రేక్‌‌ అంటే ఒక అరగంట ఉండాలి. మిగతా టైమ్‌‌ అంతా ఆఫీసులోనే ఉండాలన్న రోజులు కూడా తగ్గిపోతున్నాయి. సాయంత్రం ఒక అరగంట ఎక్కువైనా పనిచేసి మధ్యలో బ్రేక్స్‌‌ తీసుకోవడాన్ని ఈ జనరేషన్‌‌ ఒక కంఫర్ట్‌‌గా చూస్తోంది.

ఉద్యోగాలే మారినయ్‌!

ఉద్యోగాల్లో మ్యానుఫాక్చరింగ్‌ ఉద్యోగాలు, సర్వీస్‌ ఓరియెంటెడ్‌ వేరువేరు. ఒకప్పటిలా అందరూ ఫ్యాక్టరీల్లో ఉండి పనిచేసే రోజులు కావు ఇవి. ఉద్యోగం తీరు మారింది. ఏసీ గదుల్లో కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగాలు పెరిగాయి. ఫ్యాక్టరీలు కూడా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి. దీంతో పనితీరు మారింది. ఒకప్పుడు పని మధ్యలో కాసేపు కూర్చోవడం అన్నది ఒక కంఫర్ట్‌ అయితే, ఇప్పుడు కంఫర్ట్స్‌ వేరే. కాలానికి తగ్గట్టు అవి మారుతూ వచ్చాయి. ఇప్పుడు సెలవులు, వీకాఫ్‌లు, వర్కింగ్‌ టైమ్‌ పక్కాగా ఉండాలని, దాన్ని తమ కంఫర్ట్‌ అని చెప్పుకుంటున్నారు. ఒకప్పుడైతే వర్కింగ్‌ టైమ్‌ని ఫాలో అవ్వడం తక్కువ. పని అయ్యేంతవరకూ చేస్తూనే ఉండాలి. ఇలా చాకిరీ చేయించడం ఇప్పటికీ ఉన్నా, ఎక్కువగా టైమ్‌ని ఫాలో అవ్వడం ఈ జనరేషన్‌ ఉద్యోగులు దక్కించుకుంటున్న కంఫర్ట్‌.