చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు జవాన్లు మృతి

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు జవాన్లు మృతి
  • మరో 14  మందికి  గాయాలు

భద్రాచలం, వెలుగు: చత్తీస్ గఢ్ లోని బీజాపూర్–సుక్మా సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స కోసం రాయ్ పూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

సుక్మా జిల్లాలోని టేకులగూడెంలో మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని భద్రతా బలగాలు క్యాంప్ ను ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా బెటాలియన్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరపగా ముగ్గురు జవాన్లు మరణించారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని పోలీసు అధికారులు తెలిపారు.