
- దిగువకు కంటిన్యూ అవుతున్న భారీ వరద
- శ్రీశైలంలోకి 2,58,096 క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం నుంచి 10 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
హైదరాబాద్, వెలుగు : ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి భారీ వరద కంటిన్యూ అవుతున్నది. నిన్న మొన్నటి వరకు 2.5 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదలగా.. తాజాగా అది 3 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి ఆల్మట్టి డ్యామ్‌నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదిలారు. నారాయణపూర్‌కు 2,61,397 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2,65,360 క్యూసెక్కులను రిలీజ్ చేస్తున్నారు.
జూరాలకు 2.49 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. శ్రీశైలానికి 2,54,127 క్యూసెక్కులను వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాలతో పాటు తుంగభద్ర నుంచి కూడా 98,360 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 2,58,069 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దిగువకు పవర్ జనరేషన్ ద్వారా 45,236 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 109.01 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రాజెక్టు నిండేందుకు మరో 106.8 టీఎంసీల నీళ్లు కావాలి. నాగార్జున సాగర్‌కు 6,500 క్యూసెక్కులు వస్తుండగా.. అంతే మొత్తాన్ని వదులుతున్నారు.
నిండుతున్న ఎల్లంపల్లి
గోదావరి బేసిన్‌లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు నిండింది. ఆ ప్రాజెక్టుకు ప్రస్తుతం 16,682 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. మొత్తం 20.175 టీఎంసీలకు గాను 16.29 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. రెండు రోజుల్లో ప్రాజెక్టుకు మరింత వరద వచ్చే అవకాశం ఉండటంతో తాగు నీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇక, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 25,150 క్యూసెక్కుల వరద వస్తున్నది.
మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి 9,89,600 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే వరదను దిగువకు వదులుతున్నారు. సమ్మక్కసాగర్ బ్యారేజీకి 10,74,200 క్యూసెక్కులు వస్తుండగా.. ఆ మొత్తాన్ని వదిలేస్తున్నారు. సీతమ్మసాగర్ నుంచి 11,00,742 క్యూసెక్కులు, భద్రాచలం నుంచి 10,11,364 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
కేఆర్ఎంబీకి తెలుగు రాష్ట్రాల విజ్ఞప్తి
శ్రీశైలం నీటి కోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ, ఏపీ లేఖలు రాశాయి. తాగునీటి అవసరాల కోసం ఏపీ లేఖ రాయగా.. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ లెటర్ రాసింది. ప్రస్తుతం రాయలసీమకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్లేందుకు అనుమతివ్వాల్సిందిగా ఏపీ తన లేఖలో కోరింది. 12 టీఎంసీలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఇక, శ్రీశైలం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా పవర్జనరేషన్ చేసుకునేందుకు అధికారులు కేఆర్ఎంబీకి రిక్వెస్ట్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ లెవెల్ 830 అడుగులు దాటితే తెలంగాణ విద్యుదుత్పత్తి చేసుకునేందుకు ఇప్పటికే ఒప్పందం ఉంది. ఈ క్రమంలోనే విద్యుదుత్పత్తి చేసుకునేందుకు అనుమతి కోరుతూ అధికారులు కృష్ణా బోర్డుకు లెటర్ రాశారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 885 అడుగులకుగానూ 861 అడుగులుగా ఉంది.
మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వెస్ట్ బెంగాల్‌కు సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, చిరుజల్లులు కురిసే చాన్స్ ఉందని చెప్పింది. శుక్రవారం కామారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తేలికపాటి వర్షాలు పడ్డాయి.