జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్.. పహల్గాం టెర్రర్ ఎటాక్ నిందితులు హతం

జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్.. పహల్గాం టెర్రర్ ఎటాక్ నిందితులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎ రాజధాని శ్రీనగర్‏లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భారత భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు దేశంలో సంచలనం సృష్టించిన పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నవారిగా సమాచారం. ఘటన స్థలంలో ఆపరేషన్ కొనసాగుతోందని.. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఇండియన్ ఆర్మీ తెలిపింది.

2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 26 మంది చనిపోయారు. పహల్గాం టెర్రర్ ఎటాక్ నిందితులను మట్టుబెట్టడం కోసం ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ చేపట్టింది.

 ఈ ఆపరేషన్లో భాగంగా సోమవారం (జూలై 28) శ్రీనగర్‌లోని దచిగామ్ నేషనల్ పార్క్ దగ్గర హర్వాన్-లిద్వాస్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, సీఆర్‎పీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా దళాలు కార్డ్ సెర్చ్ చేస్తుండగా ఉగ్రవాదులు కంటబడ్డారు. వెంటనే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం చుట్టుముట్టింది. దీంతో భారత బలగాలపై కాల్పులు జరిపారు ఉగ్రమూకలు. ఇండియన్ ఆర్మీ కూడా కౌంటర్ ఫైరింగ్ జరిపింది.

ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఎన్ కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రవాద దాడితో సంబంధం ఉన్నవారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఘటన స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‎పై సోమవారం (జూలై 28) పార్లమెంట్లో చర్చ జరగబోతున్న తరుణంలో పహల్గాం టెర్రర్ ఎటాక్ నిందితులను భద్రతా దళాలు మట్టుబెట్టడం గమనార్హం.