
- జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
- కొత్తగా మరో కమర్షియల్ కాంప్లెక్స్
- వివిధ స్పోర్ట్స్ కోర్టులు, ఇతర అభివృద్ధి పనులకు ప్రపోజల్స్
- డీపీఆర్ రెడీ చేసిన ఆఫీసర్స్
- ఇప్పటికే ఇండోర్ స్టేడియంలో రూ.1.5 కోట్లతో కొనసాగుతున్న వర్క్స్
- స్పోర్ట్స్ స్కూల్ రాకతో స్పీడ్ గా మారుతున్న స్టేడియం రూపురేఖలు
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే వరంగల్ కు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం మంజూరు కాగా, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జేఎన్ఎస్ ను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాదేశాల మేరకు ఆఫీసర్లు రూ.30 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు.
స్టేడియంలో వివిధ కోర్టుల డెవలప్మెంట్ తోపాటు ప్రతి నెలా ఆదాయం సమకూరేలా కొత్తగా మరో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జేఎన్ఎస్ బాయ్స్ హాస్టల్ లో స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేస్తుండగా, మరిన్ని అభివృద్ధి పనులతో స్టేడియం కొత్త కళను సంతరించుకోనుంది.
రూ.30 కోట్లతో డీపీఆర్
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో రాణించిన ఎంతోమంది క్రీడాకారులకు హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం పెద్ద దిక్కుగా నిలిచింది. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు సుమారు 23 ఎకరాల్లో ఇండోర్, ఔట్ డోర్ స్టేడియంతోపాటు స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఏకైక స్టేడియమైనా గత ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు.
నాలుగేండ్ల కింద సెంట్రల్ ఫండ్స్ రూ.7 కోట్లతో ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్ మినహా ఇక్కడ డెవలప్మెంట్ ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జేఎన్ఎస్ డెవలప్ మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్టేడియం సమగ్ర అభివృద్ధి కోసం ప్రపోజల్స్ కోరగా, డీవైఎస్వో అశోక్ కుమార్ ఆధ్వర్యంలో డీపీఆర్ రెడీ చేశారు. ఈ మేరకు ఆయా పనులకు రూ.30 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు.
మరో షాపింగ్ కాంప్లెక్స్..
జేఎన్ఎస్ డెవలప్మెంట్ లో భాగంగా కొత్తగా మరో షాపింగ్ కాంప్లెక్స్ కు ప్రతిపాదనలు పెట్టారు. ఇప్పటికే ఇండోర్ స్టేడియం పక్కన జేఎన్ఎస్ కు చెందిన స్థలంలో 'కుడా' కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయగా, జేఎన్ఎస్ లోని బాయ్స్ హాస్టల్ ముందున్న స్థలంలో మరోటి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
జీ ప్లస్ వన్ బిల్డింగ్ నిర్మించి, దాని ద్వారా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి ఆదాయం సమకూరేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం జేఎన్ఎస్ కు ఒకవైపు ఎంట్రన్స్ మాత్రమే వినియోగంలో ఉండగా, కొత్త ప్లాన్ ప్రకారం మూడు వైపులా ఎంట్రన్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, హ్యాండ్ బాల్ తదితర కోర్టులను డెవలప్ మెంట్ కోసం ప్లాన్ రెడీ చేశారు.
స్పోర్ట్స్ స్కూల్ తో మరింత కొత్తగా..
ఇప్పటికే జేఎన్ ఇండోర్ స్టేడియంను రూ.68 లక్షలతో డెవలప్ చేస్తున్నారు. రూ.41 లక్షలతో స్విమ్మింగ్ పూల్, రూ.34 లక్షలతో జిమ్నాస్టిక్స్ కోర్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వం హనుమకొండ జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ ను మంజూరు చేయగా, దానిని తాత్కాలికంగా జేఎన్ఎస్ బాయ్స్ హాస్టల్ లోనే ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే దానికి సంబంధించిన మెటీరియల్ కూడా జేఎన్ఎస్ కు చేరుకుంది. ఓ వైపు ఇండోర్ స్టేడియం డెవలప్మెంట్, స్పోర్ట్స్ స్కూల్ వర్క్స్ తో జేఎన్ఎస్ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే స్టేడియం సమగ్రాభివృద్ధికి మరికొన్ని ప్రపోజల్స్ ప్రభుత్వానికి చేరాయి. ఆ పనులకు ఆమోదం లభించి, ఫండ్స్ సాంక్షన్ అయితే జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం మరింత కొత్తగా మారనుంది.
స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం..
ఓరుగల్లును స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నం. ఇందులో భాగంగానే క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ వరంగల్ కు తీసుకొచ్చాం. జేఎన్ఎస్ లో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టగా, అవి చివరి దశకు చేరుకున్నాయి. స్టేడియం సమగ్రాభివృద్ధికి డీపీఆర్ తయారు చేయించాం. ఆ పనులకు ఆమోదం లభించేలా తగిన కృషి చేస్తాం.- నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే