సొంత ప్రజల పైనే బాంబుల వర్షం.. ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్

సొంత ప్రజల పైనే బాంబుల వర్షం.. ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్
  • సొంత ప్రజల పైనే బాంబుల వర్షం.. 
  • ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన పాకిస్తాన్ ఎయిర్​ఫోర్స్
  •  30 మంది పౌరులు మృతి
  • టెర్రరిస్టులపై దాడికి యత్నించి.. జనావాసాలపై బాంబులు!
  • ఖైబర్‌‌‌‌ ప్రావిన్స్​లో ఘటన

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎయిర్​ఫోర్స్.. తన సొంత భూభాగమైన ఖైబర్‌‌‌‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ తిర్హా లోయలోని మాత్రె దారా గ్రామంపై బాంబుల వర్షం కురిపించింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో 30 మంది పౌరులు చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ దాడుల కోసం పాకిస్తాన్ ఎయిర్​ఫోర్స్.. చైనా ఫైటర్ జెట్లను ఉపయోగించింది. మొత్తం 8 ఎల్ఎస్ – 6 టైప్ బాంబులు వేసింది. 

చెల్లాచెదురుగా పడి ఉన్న మృత దేహాలు.. చిన్నారుల రోదనలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు స్థానిక మీడియా చెబుతున్నది. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడ్తున్నాయి. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు చెప్తున్నారు.

పాకిస్తాన్ చేపడ్తున్న యాంటీ టెర్రరిజం ఆపరేషన్లలో భాగంగానే ఈ దాడులు చేసినట్లు తెలుస్తున్నది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ బార్డర్​లో ఈ గ్రామం ఉండటంతో టెర్రరిస్టులపై దాడులు చేసే ప్రయత్నం కాస్తా ఫెయిలై.. జనావాసాలపై బాంబులు వేసినట్లు తెలుస్తున్నది. గతంలోనూ ఖైబర్‌‌‌‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లోనే పాకిస్తాన్ ఎయిర్​ఫోర్స్ దాడులు చేసింది. అప్పుడు కూడా పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోయారు. ఈ దాడులను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా పలు మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండించాయి. కాగా, ఈ వైమానిక దాడులపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

పాక్, అఫ్గాన్ బార్డర్​లో మాత్రె దారా విలేజ్
తిర్హా లోయలోని మాత్రె దారా గ్రామం.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ బార్డర్​లో ఉంటుంది. లోయలో టెర్రరిస్టు గ్రూపులు యాక్టివ్​గా ఉంటాయి. ఈ ఏడాది జనవరిలో అంతకుముందు నెలతో పోలిస్తే ఖైబర్‌‌‌‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో టెర్రరిస్ట్ దాడులు 42 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని పాక్‌‌‌‌ ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఫర్‌‌‌‌ కాన్ఫ్లి  స్టడీస్‌‌‌‌ అండ్‌‌‌‌ సెక్యూరిటీ స్టడీస్‌‌‌‌ గణాంకాలు చెప్తున్నాయి. బలూచిస్తాన్ తర్వాత ఎక్కువ టెర్రరిస్టు దాడులు ఇక్కడే జరుగుతుండటంతో పాకిస్తాన్ ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఈ ఏడాది జూన్‌‌‌‌లో జరిగిన డ్రోన్ దాడిలో ఒక చిన్నారి చనిపోయింది.  కాగా, ఆపరేషన్ సిందూర్​లో భాగంగా పాకిస్తాన్, పీవోకేలోని 9 టెర్రరిస్టు క్యాంపులను ఇండియా ధ్వంసం చేసింది. దీంతో ఈ రెండు టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు తమ స్థావరాలను అఫ్గాన్ ​బార్డర్​లో ఉన్న ఖైబర్‌‌‌‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

ఆంక్షల కారణంగానే చైనా ఫైటర్ జెట్లతో దాడులు..
పాకిస్తాన్ ఎయిర్​ఫోర్స్.. ఈ దాడిలో చైనాతో కలిసి తయారు చేసిన జేఎఫ్ -17 థండర్ ఫైటర్ జెట్లను ఉపయోగించింది. ఇది పాక్ ఎయిర్ ఫోర్స్‌‌‌‌లో మెయిన్ మల్టీ-రోల్ ఫైటర్ జెట్. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ​తో కలిసి జేఎఫ్ 17 ఫైటర్​జెట్లను డెవలప్ చేసింది. ఈ జెట్లు తక్కువ ఖర్చుతో, అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటాయి. అందుకే పాక్​ ఆర్మీ ఎక్కువగా వీటినే వాడుతుంది. దీనికితోడు అమెరికా, రష్యా నుంచి ఆయుధాలు పొందడంపై ఆంక్షలు ఉండటంతో పాక్​ ఎక్కువగా చైనా మీద ఆధారపడుతోంది.

భారీగా ఆస్తి, ప్రాణ నష్టం
దాడులకు పాకిస్తాన్ ఎయిర్​ఫోర్స్.. చైనాకు చెందిన జేఎఫ్ 17 థండర్ ఫైటర్ జెట్‌‌‌‌లను ఉయోగించింది. ఎనిమిది ఎల్​ఎస్ 6 ప్రెసిషన్ గ్లైడ్ బాంబులు విసిరింది. దీంతో మాత్రె దారా గ్రామంలోని ఇండ్లు, మసీదులు, స్కూళ్లు, మార్కెట్లు ధ్వంసం అయ్యాయి. టీటీపీ టెర్రరిస్టులే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్లు సమాచారం.

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఖైబర్‌‌‌‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో 605 టెర్రరిస్టు దాడులు జరిగాయని అక్కడి పోలీసులు చెప్తున్నారు. ఈ దాడుల్లో సుమారు 138 మంది సాధారణ పౌరులు, 79 మంది పోలీసులు చనిపోయారు. ఒక్క ఆగస్టులోనే 129 టెర్రరిస్టు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఆరుగురు పాకిస్తానీ ఆర్మీ జవాన్లు, పారా మిలటరీ ఫెడరల్ కానిస్టేబులరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు.