
హైదరాబాద్, వెలుగు:చిన్నపిల్లలకు పంపిణీ చేసే మందుల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏకంగా 30 లక్షల నాసిరకం ‘ఆల్బెండజోల్’ గోలీలను జిల్లాలకు పంపించారు. చివరి నిమిషంలో ఈ విషయం బయటపడటంతో గురువారం జరగాల్సిన పంపిణీని నిలిపివేశారు. ఆ గోలీలన్నింటినీ వెనక్కి తెప్పిస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలుస్తోంది. 30 lakh crumbed Albendazole tablets were sent to the districts
ఏటా రెండు సార్లు..
దేశవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో ఒకటి నుంచి 19 ఏండ్ల వయసున్న వారిలో నులి పురుగుల నివారణ కోసం ‘ఆల్బెండజోల్’ గోలీలను పంపిణీ చేస్తారు. ఎంతమందికి పంపిణీ చేయాలి, ఎన్ని గోలీలు కావాలన్నది ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేరకు నివేదిక రూపొందించి మందుల కొనుగోలు కోసం తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎంఐడీసీ)కి వంద రోజుల ముందు ఇండెంట్ ఇస్తారు. ఆ మేరకు టీఎస్‌ఎంఐడీసీ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసి, సరఫరా చేస్తుంది. ఈసారి ఆగస్టు 8న ఈ గోలీలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ అధికారులు ఇండెంట్ పెట్టడంలో ఆలస్యం చేశారు. 1,17,16,079 గోలీల కొనుగోలుకు జూన్ 12న ఇండెంట్ పెట్టారు. అదే నెల 17న టీఎస్‌ఎంఐడీసీ టెండర్ల ప్రక్రియను ప్రారంభించి.. 29న ఓ కంపెనీని ఖరారు చేసింది. కానీ ట్యాబ్లెట్లు సరఫరా చేయలేమంటూ పది రోజులకే ఆ కంపెనీ చేతులెత్తేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఒడిషా డ్రగ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఓడీసీఎల్)’ ట్యాబ్లెట్ల పంపిణీకి ముందుకొచ్చింది. ఒక్కో బ్యాచ్‌కు 10 నుంచి 12 లక్షల ట్యాబ్లెట్ల చొప్పున 8 బ్యాచ్‌లుగా ఎంఐడీసీ జిల్లాలకు సరఫరా చేసింది.
చెకింగ్‌లో లోపం..
ట్యాబ్లెట్ల నాణ్యత పరీక్ష బాధ్యతను అల్కాటెక్ అనే థర్డ్ పార్టీ ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. హైదరాబాద్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) సైతం వాటిని పరీక్షించింది. మొత్తం ఎనిమిది బ్యాచ్‌లకుగాను మూడు బ్యాచ్‌ల గోలీలు నాసిరకంగా ఉన్నట్టు డీసీఏ బుధవారం తేల్చింది. దీంతో ఆయా బ్యాచ్‌ల ట్యాబ్లెట్లు వెళ్లిన 13 జిల్లాల్లో పంపిణీ ఆపేయాలంటూ బుధవారం రాత్రి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాణ్యతా పరీక్షలు చేయించకుండానే గోలీలు ఎలా సరఫరా చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఆ గోలీలు వేస్తే.. పిల్లలకు జరగకూడనిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ట్యాబ్లెట్లు ప్రమాణాల ప్రకారం ఉన్నట్టు అల్కాటెక్ కంపెనీ నివేదిక ఇవ్వడంతోనే జిల్లాలకు సరఫరా చేశామని టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. డిజల్యూషన్ టెస్ట్‌లో ఫెయిలైనట్టు డీసీఏ తేల్చడంతో పంపిణీ ఆపామని, ఆ నిబంధన ఈ ఏడాదే కొత్తగా తెచ్చారని తెలిపారు. డిజల్యూషన్ అవకపోతే ట్యాట్లెట్ల ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందని, అంతేతప్ప ప్రమాదమేమీ ఉండదని అన్నారు.