
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడితెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వానలతో బుధవారం (ఆగస్ట్ 27) కాట్రా జిల్లాలోని అర్ధకుమారి సమీపంలో మాతా శ్రీ వైష్ణో దేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 31 మంది మరణించగా.. 23 మంది గాయపడ్డారు. ఘటన స్థలంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
తీవ్రంగా గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వైష్ణో దేవి ఆలయ బోర్డు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. యాత్రికుల భద్రత దృష్ట్యా వైష్ణో దేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది ఆలయ బోర్డు. భక్తులు ఆందోళన చెందకుండా.. బోర్డు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.
నాలుగు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్ జలవిలయంలో చిక్కుకుంది. ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోయిన గ్రామాలు, లోయలను తలపిస్తున్న రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో కొండలపై నుంచి నదులు పొంగి పొర్లుతున్నట్లుగా ఘోరమైన వరదలు ముంచెత్తడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోతున్నాయి.
ఇండ్లను నీళ్లు చుట్టుముట్టడంతో జనాలు నిలువనీడ లేక విలవిలలాడుతున్నారు. వర్షాలకు ఆసుపత్రులు, రోడ్ల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోయాయి. విద్యుత్ లైన్లు, మొబైల్ టవర్లు తీవ్రంగా దెబ్బతినడంతో కమ్యూనికేషన్లో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం దృష్ట్యా జమ్మూ డివిజన్ అంతటా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
దీంతో జమ్మూ-శ్రీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తావి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు అనేక నదులు, వాగులలో నీటిమట్టం ఇప్పటికే ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. నదులు, చెరువులు, కుంటలు, కొండచరియలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు అధికారులు. అత్యవరసమైతేనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.