32 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి…

32 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి…
  •   90 శాతం పూర్తయిన మరో 91 వేల ఇళ్లు
  •   వేగంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
  •   గృహ నిర్మాణ సంస్థ ఎండీ, స్పెషల్​ సీఎస్​  చిత్రా రాంచంద్రన్​

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలో డబుల్​ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని గృహ నిర్మాణ సంస్థ ఎండీ, స్పెషల్​ సీఎస్​ చిత్రా రామచంద్రన్​ తెలిపారు. ఇప్పటికే 32,008 ఇళ్లు పూర్తయ్యాయని, 91,306 ఇళ్లు 90% మేర పూర్తయ్యాయని చెప్పారు. ఈమేరకు మంగళవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటిదాకా వీటి కోసం ₹6,141 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. బిల్లులు సమర్పించిన 15 రోజుల్లోగా కలెక్టర్​ అనుమతితో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆన్​లైన్​ ప్రాజెక్ట్​ మానిటరింగ్​ సిస్టం (ఓపీఎంఎస్​) ప్రవేశపెట్టామన్నారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు సిమెంట్​, స్టీల్​ను తక్కువ ధరకే ఇప్పిస్తోందని చెప్పారు. ఇళ్ల నిర్మాణంపై పక్క రాష్ట్రాలు, జాతీయ స్థాయి అధికారులు మెచ్చుకుంటున్నారని ఆమె చెప్పారు. ఏపీ అధికారులూ ప్రాజెక్ట్​లను పరిశీలించారని, అక్కడా దానిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నారని తెలిపారు.