
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో జియో కొత్తగా 3.27 లక్షల మంది సబ్స్క్రయిబర్లను సంపాదించుకుంది. మే 2022లో జియో ఈ కొత్త సబ్స్క్రయిబర్లను పొందినట్లు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) డేటా తెలిపింది. ఇదే నెలకు భారతీ ఎయిర్టెల్ 71,312 మంది కొత్త మొబైల్ సబ్స్క్రయిబర్లను సాధించగా, వోడాఫోన్ 74,808 మంది, బీఎస్ఎన్ఎల్ 78,423 మంది సబ్స్క్రయిబర్లను పోగొట్లుకున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే మే నెలలో జియో 31.11 లక్షల కొత్త సబ్స్క్రయిబర్లను ఆకట్టుకుంది. దీంతో ఆ కంపెనీ మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరింది. మే నెలలో 10.27 లక్షల మంది సబ్స్క్రయిబర్లను పొందిన భారతీ ఎయిర్టెల్ తన మొత్తం కస్టమర్ల సంఖ్యను 36.31 కోట్లకు పెంచుకోగలిగింది. మరోవైపు 7.5 లక్షల మందిని పోగొట్టుకున్న వోడాఫోన్ కస్టమర్లు 25.84 కోట్లకు తగ్గిపోయారు. 53.62 లక్షల మంది సబ్స్క్రయిబర్లను కోల్పోయిన బీఎస్ఎన్ఎల్ కూడా 11.28 కోట్ల కస్టమర్లతో సరిపెట్టుకుంది.