- పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వ్యాపారుల్లో జోష్
నల్గొండ/యాదాద్రి, వెలుగు: నూతన మద్యం పాలసీ సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు ఇప్పటికే అడ్డాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమై రెండేళ్ల పాటు కొత్తమద్యం పాలసీ అమలులో ఉండనుంది.
జిల్లా వ్యాప్తంగా 2025–-2027 సంవత్సరానికి 329 వైన్స్ లను ఇటీవల ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఇప్పటికే నూతన వైన్స్ ల వ్యాపారులు మద్యాన్ని కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. పాత వైన్స్ ల యజమానులు వారం ముందు నుంచే స్టాక్‌ఖాళీ చేశారు. కొన్ని చోట్ల పాత వారితో మాట్లాడి అవే దుకాణాలు కొనసాగిస్తుండగా కొందరు మాత్రం తమకు నచ్చిన చోట దుకాణాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 329 వైన్స్ షాపులు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 329 వైన్స్ షాపులు ఉండగా నల్గొండ జిల్లాలో 154 షాపులు, సూర్యాపేటలో 93 షాపులు, యాదాద్రి జిల్లాలో 82 వైన్స్ షాప్స్ ఉన్నాయి. ఈ వైన్స్‌ల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 329 షాపులకు 9,717 ఆప్లికేషన్స్వచ్చాయి. దీంతో సర్కార్‌కు రూ.291.51 కోట్ల ఆదాయం వచ్చింది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ..
కొత్త మద్యం షాపులు ప్రారంభంలోనే పంచాయతీ ఎన్నికలు కలిసి రావడంతో యజమానులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి కొత్త లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. మొదటి విడత నామినేషన్లు ముగియగా, రెండో విడతలో ఎనిమిది మండలాల్లో నామినేషన్లు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి.
సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకోవాలంటే పోటీదారులకు మద్యం ప్రధాన అస్త్రం కానుంది. ఎన్నికలయ్యాక వారం పాటు దావతులు నడుస్తాయి. డిసెంబరు 31 నూతన సంవత్సరం వేడుక జనవరిలో సంక్రాంతి వరకు మద్యం విక్రయాలు పెద్దఎత్తు న జరిగే అవకాశం ఉండనుండటంతో కొత్త మద్యం వ్యాపారులకు కలిసి రానుంది
కొన్ని చోట్ల అభ్యంతరాలు
జిల్లాలో పలు చోట్ల వైన్స్ షాపుల ఏర్పాటు పై ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా స్కూల్స్, హాస్పిటల్స్, దేవాలయాల మధ్యలో వైన్స్ ఏర్పాటు చేస్తున్నారంటూ పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఊరికి చివరగా పెట్టుకునేలా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మద్యం వ్యాపారస్తులతో మాట్లాడి ఒప్పించారు.
నల్గొండలో మాత్రం వైన్స్ షాపులు అన్నీ రూల్స్ ఉన్నప్పటికీ అధికారులు కావాలని పర్మిషన్స్ ఇవ్వడం లేదని, రూల్స్ లేకున్నా దేవాలయాలు, స్కూల్స్ పక్కన పర్మిషన్స్ ఇస్తున్నారంటూ పలు వైన్స్ షాపుల యజమానులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక మిర్యాలగూడలో నివాసల మధ్య ఏర్పాటు చేశారంటూ ఆదివారం స్థానికులు ఆందోళన చేపట్టారు.
