అలా చేస్తే మీ పార్టీలు మటాష్.. కాంగ్రెస్, ఎన్సీపీకి మోడీ వార్నింగ్
కాశ్మీర్ కేవలం భూభాగం కాదు.. దేశానికి కిరీటమన్న ప్రధాని
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం
జల్గావ్/ సకోలీ(మహారాష్ట్ర): దేశ ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతుండటం దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని మళ్లీ అమల్లోకి తీసుకొస్తామంటూ కాంగ్రెస్ ఎన్సీపీ లు పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాశ్మీర్ అంటే కేవలం భూభాగం మాత్రమే కాదని, దేశానికి కిరీటమని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలకు నిజంగా దమ్ముంటే ఆర్టికల్ 370ని మళ్లీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాలని మోడీ సవాలు విసిరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జల్గావ్, సకోలీ జిల్లా కేంద్రాల్లో జరిగిన బహిరంగ సభల్లో మోడీ మాట్లాడారు. కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాయని, ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే అసాధారణ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని, 40 ఏండ్ల కాశ్మీర్ సమస్యను 4 వారాల్లో పరిష్కరించామని ప్రధాని తెలిపారు.
మచ్చలేని దేవేంద్రుణ్నే మళ్లీ గెలిపించండి
న్యూఇండియా నిర్మాణం మోడీ ఒక్కడితోనే సాధ్యం కాదని, ప్రజలు ఓట్లేసి ఆశీర్వదిస్తేనే ఆ కల నెరవేరుతుందని ప్రధాని అన్నారు. మహారాష్ట్రలో ఐదేండ్లపాటు అవినీతిలేని పాలన అందించిన దేవేంద్ర ఫడ్నవీస్‌నే మళ్లీ సీఎంగా ఎన్నుకోవాలని, బీజేపీ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని మోడీ పిలుపునిచ్చారు. ‘‘మహారాష్ట్రలో 2014 ఎన్నికల ఫలితాలు ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఈ నెల 24న వెల్లడయ్యే అసెంబ్లీ రిజల్ట్స్ తర్వాత చూస్తారు”అని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ రకరకాల సవాళ్లతో సతమతమవుతోంటే ఇండియా మాత్రం ధీమాగా ముందుకెళుతోందని, రూరల్ డెవలప్మెంట్పై ఫోకస్ పెంచడం వల్లే ఇది సాధ్యమైందని, ఆ సెక్టార్లో 25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రధాని చెప్పారు.
గత ప్రధానులకు మోడీకున్న దమ్ములేదు: షా
జమ్మూకాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్‌ను రద్దు చేయడం ద్వారా ప్రధాని మోడీ దేశ ప్రజల కలని నిజం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన వాళ్లెవరికీ లేనంత దమ్ము, ధైర్యం ఉండబట్టే మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకోగలిగారని చెప్పారు. కొల్హాపూర్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, మహారాష్ట్రలో ఫడ్నవీస్ సర్కారు అమలు చేసిన ‘జల్యుక్తా శివార్’ పథకం ద్వారా వేలాది ఎకరాలు సాగుభూమిగా మారిందని, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ కూటమినే మళ్లీ గెలిపించాలని షా అన్నారు.

