
- అలివి వలలతో చేపలు పట్టేందుకు వాడుకుంటున్న మాఫియా
కొల్లాపూర్, వెలుగు: మత్స్య మాఫియా నుంచి సోమవారం 38 మంది కూలీలను నేషనల్ ఆదివాసీ సమగ్ర అభివృద్ధి సంస్థ(స్వచ్ఛంద సంస్థ) ప్రతినిధులు అధికారుల సహకారంతో విముక్తి కల్పించారు. వివరాలిలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సమీపంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మత్స్య మాఫియా నిషేధిత అలివి వలలతో చేపల వేట సాగిస్తోంది. చేపల వేట కోసం మాఫియా వివిధ రాష్ట్రాల్లో రైల్వే స్లేషన్లు, బస్ స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో యాచించే వారిని, ఒంటరి పురుషులను గుర్తించి మాయమాటలు చెప్పి తీసుకొచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు.
ఈ క్రమంలో రెండు రోజుల కింద విజయవాడకు చెందిన ఓ మహిళ తన భర్త కన్పించడం లేదని నేషనల్ ఆదివాసీ సమగ్ర అభివృద్ధి సంస్థకు చెందిన లేబర్ ఇండియా హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. స్పందించిన సంస్థ ప్రతినిధులు, లీగర్ అడ్వైజర్ వలిగొండ విజయరాజ్ సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని లేబర్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
లేబర్ ఆఫీసర్ రాజ్‌కుమార్, తహసీల్దార్ విజయసింహ, అధికారులు కృష్ణా తీరానికి చేరుకొని 38 మంది కూలీలను గుర్తించారు. వారిని పెంట్లవెల్లిలోని ఎస్సీ హాస్టల్ కు తరలించారు. మంగళవారం ఆర్డీవో ఎదుట హాజరు పరిచి వారి స్వస్థలానికి పంపుతామని తహసీల్దార్ తెలిపారు.