
నిర్మల్/జన్నారం/లక్సెట్టిపేట/ఆసిఫాబాద్, వెలుగు: నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం కొన్ని సెకన్లపాటు భూమి పించింది. నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు ఖానాపూర్, కడెం, పెంబి తదితర మండలాల్లో దాదాపు 15 సెకన్లపాటు భూమి కనిపించడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఖానాపూర్ పట్టణంలో వ్యాపారులంతా దుకాణాల నుంచి రోడ్లపైకి వచ్చి గుమిగూడారు. భూకంపానికి ముందు దాదాపు అరగంటకుపైగా, ఆ తర్వాత భారీగా ఈదురుగాలులతోపాటు చాలా చోట్ల వర్షం కురిసింది.
జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లో..
జన్నారంలో సాయంత్రం 6.30 సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. మండలంలోని పొనకల్, బాదంపల్లి, జన్నారం, తిమ్మాపూర్, రూప్ నాయక్ తండాల్లో భూమి సుమారు 2 నుంచి 3 సెకండ్ల వరకు కంపించినట్లు ఆయా గ్రామాల ప్రజల తెలిపారు. ఇంట్లో ఉన్న వంట పాత్రలు, ఇంటి ముందున్న రేకులు ఒక్కసారిగా కదిలినట్లు చెప్పారు. లక్షెట్టిపేట మండలంలో స్వల్పంగా భూకంపం వచ్చింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించగా భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. ఎలాంటి నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గోలేటి ఓపెన్ కాస్ట్ సమీపంలో..
రెబ్బెన మండలం గోలేటీ ఓపెన్ కాస్ట్ మైన్స్ కు సమీపంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.8గా నమోదైంది. ఎటువంటి ఆస్తి, నష్టం ప్రాణనష్టం జరగలేదు. భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.