తెలంగాణకు 38వేల కోట్ల ‘ముద్ర’ రుణాలు మంజూరు

తెలంగాణకు 38వేల కోట్ల ‘ముద్ర’ రుణాలు మంజూరు
  • 47.26 లక్షల ఖాతాల్లోకి నిధుల కేటాయింపు 
  • కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి వివరణ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ముద్ర’’ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇవాళ్టి వరకు గత ఆరేళ్లుగా తెలంగాణకు 38 వేల 114 కోట్ల ముద్ర రుణాలు మంజూరు జరిగింది. దాదాపు 47.26 లక్షల ఖాతాల్లోకి ఈ రుణాల నిధులు కేటాయించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి వివరణ ఇచ్చారు. 
తెలంగాణ విషయానికొస్తే... ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు గత ఆరేళ్లలో మొత్తం 47,26,819 మంది ఖాతాలకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. వీటిలో 37 లక్షల 46వేల 740 మందికి రూ.50 వేలలోపు (శిశు పథకం) రుణాలు, అలాగే మరో 7 లక్షల 94 వేల 193 మందికి  రూ.5 లక్షల లోపు (కిషోర్ పథకం) రుణాలు, అలాగే 1 లక్షా 85 వేల 886 మందికి  రూ.10 లక్షల లోపు (తరుణ్ పథకం) రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి వివరించారు.