
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 3,867 మంది టీచర్లకు ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వనుంది. అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లుగా.. స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) కు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు కల్పించనుంది. ఈ నెల 2న పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించి 11తో ముగించనున్నది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేశారు. గెజిటెడ్ హెడ్మాస్టర్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రస్తుత నిబంధనల మేరకు పదోన్నతులు చేపడతామని ప్రకటించారు. ప్రమోషన్ పొందిన స్కూల్ అసిస్టెంట్లను అవసరమైన స్కూళ్లలోనే నియమించాలనే నిబంధనను విధించారు. శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వెబ్ సైట్ www.schooledu.telangana.gov.in తో పాటు జిల్లాల డీఈఓల వెబ్ సైట్లలో గ్రేడ్ 2 హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీల వివరాలు పెట్టనున్నారు.
దీంతో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియలో 3,867 మందికి లబ్ధి చేకూరున్నది. దీంట్లో 902 మంది స్కూల్ అసిస్టెంట్లు.. హెచ్ఎంలుగా ప్రమోషన్ పొందనున్నారు. దీంతో మల్టీ జోన్ 1 పరిధిలో 491, మల్టీ జోన్ 2 పరిధిలో 411 మంది హెడ్ మాస్టర్లుగా రానున్నారు. ఈ క్రమంలోనే 2,965 మంది ఎస్జీటీలు పదోన్నతి పొందనున్నారు. దీంతో స్కూల్ అసిస్టెంట్లుగా 2,324 మంది, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లుగా 641 మంది ప్రమోషన్ పొందనున్నారు. అయితే బదిలీల ప్రక్రియ నిర్వహించి రెండేండ్లు పూర్తికాకపోవడంతో, ప్రభుత్వం కేవలం ప్రమోషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నది. కాగా.. ఏడాదిలోనే మరోసారి ప్రమోషన్లు ఇవ్వడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాజిక స్పందన వేదిక చైర్మన్ పర్వతి సత్యనారాయణ థ్యాంక్స్ చెప్పారు.