పట్నంలో పుస్తకాల పండుగ షురూ..ఈసారి ఇవీ ప్రత్యేకతలు

పట్నంలో పుస్తకాల పండుగ షురూ..ఈసారి ఇవీ ప్రత్యేకతలు
  • 38వ నేషనల్ బుక్ ఫెయిర్​ను ప్రారంభించిన మంత్రి జూపల్లి 
  • జిల్లాల్లో బుక్ ఫెయిర్లకు రూ.3 కోట్లు ఇస్తామని ప్రకటన

ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్​ఎన్టీఆర్​స్టేడియంలో 38వ నేషనల్​బుక్​ఫెయిర్ ఘనంగా ప్రారంభమైంది. ఈసారి లోకకవి అందెశ్రీ పేరుతో డిసెంబర్19 నుంచి 29 వరకు నిర్వహించనున్న పుస్తకాల పండుగను మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య​అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు ఆదరణ తగ్గలేదని, చదివేవారికి నిజమైన మిత్రుడు పుస్తకమేనని చెప్పారు.

ప్రస్తుత విద్యావ్యవస్థ మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి విలువలు, సంస్కారం కల్తీ అయిపోయాయని, ఉద్యోగం, -సంపాదనలోపడి మానవ జన్మ సార్థకతను మర్చిపోతున్నామన్నారు. పాతకాలపు సంస్కారం తిరిగి రావాలంటే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, పుస్తకాలు చదవాలని సూచించారు. చరిత్రకు నిదర్శనం పుస్తకాలేనని, వాటిని జిల్లాలకు పరిచయం చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో బుక్ ఫెయిర్ ఏర్పాటుకు కల్చరల్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ద్వారా రూ.3 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడం చరిత్రలోకి ప్రయాణం లాంటిదన్నారు. 

డిజిటల్ పుస్తకాలను చదవడం కన్నా.. భౌతికంగా పుస్తకాన్ని చేతితో పట్టుకుని చదివితే వచ్చే అనుభూతి వేరన్నారు. పుస్తకాలు చదివితేనే శాశ్వత జ్ఞానం వస్తుందని తెలిపారు. పుస్తక పఠనం ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని ప్రముఖ జర్నలిస్టు రామచంద్రమూర్తి అన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పుస్తకం ఉంటేనే చరిత్రలోకి తొంగి చూడగలమన్నారు. ఈ బుక్ ఫెయిర్​కోసం ఎంతోమంది ఎదురు చూడటం గొప్ప విషయమన్నారు. పదకొండు రోజుల పాటు జరిగే ఈ సాహిత్య కార్యక్రమంలో సాహితీ ప్రియులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ‘వెలుగు’ దినపత్రిక ఏర్పాటు చేసిన కౌంటర్ ను పాఠకులు సందర్శించారు.   

ఈసారి ఇవీ ప్రత్యేకతలు.. 

  • బుక్​ఫెయిర్​లో గతేడాది 360 స్టాల్స్ ఏర్పాటు చేయగా.. ఈసారి 365 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎంట్రీ ఫీజు రూ.10గా నిర్ణయించారు. అయితే, విద్యార్థులు, వారితో వచ్చిన టీచర్లు గుర్తింపు కార్డు చూపిస్తే ఉచిత ప్రవేశం ఉంటుంది.
  • బుక్​ఫెయిర్​ప్రాంగణానికి లోకకవి అందెశ్రీ పేరు, ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత పేరు, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్​గౌడ్​పేరు పెట్టారు. 
  • బుక్ ఫెయిర్​కు వచ్చేవారి కోసం తెలంగాణ వంటకాలతో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈసారి ప్రధాన వేదికకు ఎదురుగా చార్మినార్ మోడల్ ఏర్పాటు చేసి, దాన్ని సెల్ఫీ స్పాట్​గా మలిచారు. చిన్నారులు ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియాతోపాటు తల్లిదండ్రులకు సిట్టింగ్ ఏరియాను సిద్ధం చేశారు.