నవంబర్ 3వ వారం 5 ఐపీఓలు

నవంబర్ 3వ వారం 5 ఐపీఓలు
  •     ఈ లిస్టులో టాటా టెక్నాలజీస్​ కూడా
  •     రూ.7,300 కోట్ల సమీకరణ

ముంబై : దలాల్​ స్ట్రీట్‌లో ​ఈ వారం కనీసం ఐదు కంపెనీలు అడుగుపెట్టబోతున్నాయి. తమ ఐపీఓలను సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌ల కోసం ప్రారంభించబోతున్నాయి. ఇవి ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్ల(ఐపీఓ) ద్వారా రూ.7,300 కోట్ల కంటే ఎక్కువ సమీకరించే అవకాశం ఉంది. టాటా టెక్నాలజీస్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌‌‌‌మెంట్ ఏజెన్సీ (ఇరెడా), ఫెడ్‌‌‌‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్,  గాంధార్ ఆయిల్ రిఫైనరీ తమ ఐపీఓలను ఇదే వారంలో సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం తీసుకువస్తున్నాయి.

"రాబోయే క్వార్టర్లలో ఇంకా చాలా కంపెనీలు తమ ఐపీఓలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సెబీ క్లియరెన్స్ పొందిన వాటితో సహా వాటిలో చాలా వరకు సాధారణ ఎన్నికలకు ముందు ఐపీఓలను  ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ఇక ముందు కూడా ఐపీఓల కోలాహలం కొనసాగుతుంది " అని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ బ్యాంకింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రావు తెలిపారు.

టాటా టెక్నాలజీస్  

గత 20 ఏళ్లలో టాటా గ్రూప్‌‌‌‌ కంపెనీ మొదటి ఐపీఓ ఇదే. చివరిసారిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2004 లో తన ఐపీఓను పూర్తి చేసింది. ప్రస్తుత ఇష్యూ పూర్తిగా 6.08 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయానికి సంబంధించిన ఆఫర్. ఈ  ఓఎఫ్​ఎస్​ కింద టాటా మోటార్స్ 11.4 శాతం వాటాను ఆఫ్‌‌‌‌లోడ్  చేస్తుంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం వాటాను విక్రయిస్తుంది.  టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్  1.2 శాతం వాటాను అమ్ముతుంది. ఐపీఓ నవంబర్ 22 నుంచి నవంబర్ 24 వరకు దరఖాస్తుకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ తన రూ.3,042 కోట్ల ఐపీఓ కోసం ఒక్కో షేరుకు రూ.475–-500 మధ్య ధరను నిర్ణయించింది.

ఇరెడా  

ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌‌‌‌మెంట్ ఏజెన్సీ (ఇరెడా) కొత్త  రెన్యువబుల్​ ఎనర్జీ ప్రాజెక్టులు,  ఇంధన సామర్థ్యం  పరిరక్షణ ప్రాజెక్టుల కోసం ఆర్థిక సహాయాన్ని ఇస్తుంది. వీటిని అభివృద్ధి చేసి,  విస్తరిస్తుంది. కంపెనీ ఈక్విటీ షేరుకు రూ.30-– 32 గా తన ఐపీఓ ధరను నిర్ణయించింది  నవంబర్ 21 నుంచి నవంబర్ 23 వరకు సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం ఇష్యూ అందుబాటులో ఉంటుంది. ఇరెడాకు వైవిధ్యమైన పోర్ట్‌‌‌‌ఫోలియో ఉంది. 23 రాష్ట్రాలు,  
ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలలో టర్మ్ లోన్ల బకాయిలు ఉన్నాయి. 

ఫెడ్‌‌‌‌బ్యాంక్  ఫైనాన్షియల్ సర్వీసెస్  

ఫెడ్‌‌‌‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన ఐపీఓని నవంబర్ 22న సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం ప్రారంభిస్తుంది. ఇది నవంబర్ 24న ముగుస్తుంది. ఐపీఓలో రూ.600 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, రూ.492 కోట్ల విలువైన 3.51 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) ఉన్నాయి.   ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.133-–140 మధ్య నిర్ణయించారు. 

ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్  

పెన్నుల తయారీ సంస్థ ‘ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్’ లిమిటెడ్​ ఐపీఓ నవంబర్ 22న సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం మొదలై, నవంబర్ 24న ముగుస్తుంది. 45 ఏళ్ల  ఫ్లాగ్‌‌‌‌షిప్  బ్రాండ్ 'ఫ్లెయిర్'ని కలిగి ఉన్న కంపెనీ, మొత్తం రైటింగ్ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్స్ పరిశ్రమలో  టాప్​–3 కంపెనీల్లో ఒకటి. ఇది రూ.593 కోట్ల ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం ఒక షేరుకు రూ.288-–304 మధ్య ధరను నిర్ణయించింది..

గాంధార్ ఆయిల్ రిఫైనరీ  

గాంధార్ ఆయిల్ రిఫైనరీ  వైట్ ఆయిల్స్​ను తయారు చేసే కంపెనీ.  దీని ఐపీఓ ప్రైస్​ బ్యాండ్‌‌‌‌ను ఒక్కో షేరుకు రూ.160–169గా నిర్ణయించారు. ఐపీఓను నవంబర్ 22న సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం తెరుస్తారు. ఇది  నవంబర్ 24న ముగుస్తుంది. ఐపీఓలో రూ.302 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది. ప్రమోటర్లు  ఇప్పటికే ఉన్న వాటాదారుల ద్వారా 1.17 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) ఉంటుంది