
హై స్పీడ్ రైలు వందే భారత్ రైలు ఢీకొని నలుగురు చనిపోయిన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. 2025, అక్టోబర్ 3వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు. బీహార్ రాష్ట్రంలోని జోగ్బానీ నుంచి పాటలీపుత్రకు వెళుతుంది వందే భారత్ రైలు. ఈ రైలు సరిగ్గా పూర్ణియా అనే గ్రామానికి వచ్చిన తర్వాత.. రైలు పట్టాలు దాటుతున్న యువకులను ఢీకొట్టినట్లు చెబుతున్నారు పోలీసులు.
వందే భారత్ రైలు ఢీకొని చనిపోయిన వాళ్లందరూ యువకులు. వీరి వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉంది. వీళ్లందరూ దసరా ఉత్సవాల సందర్భంగా జరిగే దసరా మేళాలో పాల్గొని తిరిగి ఇళ్లకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదానికి గురయ్యి చనిపోయినట్లు స్థానికుల సమాచారం. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో వందే భారత్ రైలు ఢీకొన్నట్లు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన స్థలం రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో ఉందని.. రైల్వే క్రాసింగ్ ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా లేక రైలు రాకను గమనించకుండా యువకులు నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతున్న సమయంలో ఢీకొన్నదా అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. యువకులను ఢీకొన్న తర్వాత వందే భారత్ రైలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం వెళ్లిపోయినట్లు చెబుతున్నారు స్థానికులు.
వందే భారత్ రైలు ఢీకొని నలుగురు యువకులు చనిపోగా.. చాలా మంది గాయపడినట్లు చెబుతున్నారు స్థానికులు. వీళ్లను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న GMC ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంత మంది ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.