ఒడిశాలో మరో ఘోరం : పట్టాలపై ఉన్న కూలీలపైకి దూసుకెళ్లిన రైలు.. నలుగురి మృతి

ఒడిశాలో మరో ఘోరం :  పట్టాలపై ఉన్న కూలీలపైకి దూసుకెళ్లిన రైలు.. నలుగురి మృతి

విధి రాతను తప్పించలేరు అనటానికి ఈ ఘటనే ఎగ్జాంపుల్.  వర్షం వస్తుందని.. ఎన్నో రోజలుగా పట్టాలపై అగి ఉన్న గూడ్స్ రైలు కిందకు వెళ్లారు కూలీలు.. ఈ సమయంలో పెద్దగా.. భారీగా వీచిన ఈదురుగాలులకు గూడ్స్ రైలు కదలటం.. ఆ రైలు కూలీలపైకి దూసుకెళ్లటం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు రైల్వే కూలీలు చనిపోయారు . 

మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.  ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. ఒడిశా రాష్ట్రంలో.. మొన్నటికి మొన్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం మర్చిపోకముందే.. అదే ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదం ఇది. దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

ఝాజ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో 2023 జూన్ 07  బుధవారం రోజున కూలీలు పనిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ వర్షం రావడంతో తలదాచుకునేందుకు పక్కనే ఎన్నో రోజలుగా పట్టాలపై అగి ఉన్న గూడ్స్ రైలు కిందకు వెళ్లారు.అయితే వర్షం మరింతగా పెరగడం,  భారీగా వీచిన ఈదురుగాలులకు గూడ్స్ రైలు ముందుకు కదిలింది.

దీంతో అక్కడికక్కడే ముగ్గురు కూలీలు చనిపోయారు. మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. క్షతగాత్రులను కటక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం నుంచి బయట పడకముందే మళ్లీ అలాంటి ప్రమాదమే జరగడం స్థానికులను షాక్ కు గురిచేస్తుంది.