రాయ్పూర్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఓ విద్యార్థిపై కర్కశంగా వ్యవహరించారు. హోం వర్క్ చేయలేదన్న కారణానికి నాలుగేళ్ల నర్సరీ స్టూడెంట్ను అతి దారుణంగా శిక్షించారు. పిల్లాడి చొక్కాకు తాడు కట్టి చెట్టుకు వేలాడదీసి టార్చర్ చేశారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు టీచర్ల తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వాళ్లు టీచర్లు కాదు రాక్షసులు అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
వివరాల ప్రకారం.. సూరజ్‌పూర్ జిల్లా నారాయణపూర్ గ్రామంలోని హన్స్ వాహిని విద్యా మందిర్ పాఠశాలలో ఓ నాలుగేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు. సోమవారం (నవంబర్ 24) టీచర్లు ఇచ్చిన హోం వర్క్ చేయలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన టీచర్లు బాలుడిని క్రూరంగా శిక్షించారు. ఆ చిన్నారి చొక్కాకు తాడు కట్టి పాఠశాల ఆవరణలోని చెట్టుకు వేలాడదీశారు. వద్దు మేడం.. వద్దు మేడం.. అంటూ నాలుగేళ్ల చిన్నారి ప్రాధేయపడుతున్న ఆ టీచర్లు ఏ మాత్రం కనికరం చూపలేదు.
ఈ దారుణాన్ని స్కూల్ పక్కనే నివాసం ఉండే కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్గా మారింది. హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణానికి నర్సరీ విద్యార్థిని దారుణంగా టార్చర్ చేసిన టీచర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్లు. చివరకు వీడియో బాధిత స్టూడెంట్ తల్లిదండ్రుల దగ్గరికి చేరింది. కొడుకును చిత్రహింసలు పెట్టిన వీడియో చూసి తట్టుకోలేక స్కూల్ ముందు ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు.
టీచర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో అధికారులు రంగంలోకి దిగి విచారణకు ఆదేశించారు. వీడియో ఆధారంగా.. విద్యార్థిని చిత్రహింసలు పెట్టిన టీచర్లను కాజల్ సాహు, అనురాధ దేవాంగన్‌గా గుర్తించి వారిపై వేటు వేశారు. పాఠశాల యాజమాన్యం తన తప్పును అంగీకరించి బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని స్కూల్ యాజమాన్యాన్ని ఉన్నతాధికారులు ఆదేశించారు.
