
- స్టేషన్‌ను ముట్టడించి, ఎస్సైని చితకబాదిన స్థానికులు
- నిందితుడి సస్పెన్షన్, అరెస్టు
జైపూర్ : రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసు అధికారిననే విషయం మరిచి మృగంలా మారాడు. నాలుగేండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో జరిగింది. ఎస్సై భూపేంద్ర సింగ్‌కు జిల్లాలోని రహువాస్ పోలీస్ స్టేషన్లో ఎలక్షన్ డ్యూటీ వేశారు. దీంతో రహువాస్ వెళ్లిన భూపేంద్ర సింగ్.. దగ్గర్లో ఏఎస్ఐ ఛోటేలాల్ అద్దెకు తీసుకున్న రూమ్‌లో ఉంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం రూమ్‌కు వెళ్లిన భూపేంద్ర సింగ్.. ఇంటిముందు ఆడుకుంటున్న పక్కింటి బాలికను పలకరించాడు. రూ.50 ఇస్తానని రూమ్‌లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక.. జరిగిందంతా తల్లికి చెప్పడంతో విషయం బయటపడింది. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. రహువాస్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఎస్సై భూపేంద్ర సింగ్‌ను స్టేషన్ లోపలి నుంచి బయటకు లాక్కువచ్చి చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఘటనపై గవర్నర్ సీరియస్..
ఎస్సై భూపేంద్ర సింగ్‌ను అరెస్టు చేశామని దౌసా ఎస్పీ వందితా రాణా శనివారం తెలిపారు. బాధితురాలి ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు ఎస్సైపై పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టామని చెప్పారు. భూపేంద్ర సింగ్‌ను డ్యూటీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు. ‘బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాం. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. బాధితురాలి స్టేట్ మెంట్‌ను రికార్డు చేశాం. ఈ కేసును అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్‌తో దర్యాప్తు చేయిస్తాం’ అని తెలిపారు. కాగా, ఈ ఘటనపై గవర్నర్ కల్ రాజ్ మిశ్రా సీరియస్ అయ్యారు. నిందితుడిపై కఠిన
చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఫైర్..
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేదే లేకుండా పోయిందని రాజస్థాన్ సర్కార్‌పై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. ‘‘రాజస్థాన్‌లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిందితుల్లో పోలీసులు, సర్కార్ ఉద్యోగులు ఉంటున్నారు. వాళ్లను ప్రభుత్వమే కాపాడుతున్నది. ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ‘బేటీ బచావో’ పథకం తీసుకొస్తే.. రాజస్థాన్ సర్కార్ తీరు మాత్రం ‘రేపిస్ట్ బచావో’ అన్నట్టుగా ఉంది” అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఫైర్ అయ్యారు.