
- వడదెబ్బతో 40 మందికి పైగా జవాన్లకు డీహైడ్రేషన్
- ఆర్మీ హెలికాప్టర్‌లో భద్రాచలం,
- వెంకటాపురం హాస్పిటళ్లకు తరలింపు
- కర్రె గుట్టల్లో మావోయిస్టుల కోసం 10 వేల మంది బలగాల కూంబింగ్
జయశంకర్ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు: కర్రె గుట్టల్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు సన్ స్ట్రోక్ అడ్డుతగులుతున్నది. ఎండలు తీవ్రంగా ఉండడం, అడవులు పలచబడడం, సరిపడా తాగునీరు లేకపోవడంతో జవాన్లు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే సుమారు 40 మంది జవాన్లు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని ఆర్మీ హెలికాప్టర్‌లో శుక్రవారం వెంకటాపురం, భద్రాచలం హాస్పిటళ్లకు తరలించారు. ప్రస్తుతం వారికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
4 రోజులుగా కూంబింగ్..
కర్రె గుట్టల్లో హిడ్మా, దేవా దళాలు సహా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో నాలుగు రోజుల కింద భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. సీఆర్పీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో కేంద్రం జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 10 వేల మందికి పైగా భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచే కర్రె గుట్టలను అన్నీ వైపులా చుట్టుముట్టాయి. కర్రె గుట్టల చుట్టూ తూర్పున భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా చర్ల, దక్షిణాన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలు, ఉత్తరాన పూజారి కాంకేర్, పశ్చిమాన ఇంద్రావతి నది ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతున్నది. గుట్టలపై మావోయిస్టులు అమర్చిన వందల సంఖ్యలోని ఐఈడీ బాంబులను పోలీసులు నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే గత మూడు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ములుగు జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బండరాళ్ల కారణంగా మరో రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 40 మందికి పైగా జవాన్లు వడదెబ్బకు గురికాగా, ఆర్మీ హెలికాప్టర్‌లో దగ్గర్లోని వెంకటాపురం, భద్రాచలం ప్రభుత్వ హాస్పిటళ్లకు తరలించారు. కొందరిని రోడ్డు మార్గాన వరంగల్‌కు పంపించి ట్రీట్‌మెంట్
అందిస్తున్నారు.
పోయినేడాది కూడా ఇట్లనే..
కర్రె గుట్టల్లో కూంబింగ్ చేయడం పోలీసులకు అతి పెద్ద సవాల్. గతేడాది జులైలో సైతం గుట్టల పైకి కూంబింగ్‌కు వెళ్లిన భద్రతా బలగాలు ప్రతికూల వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఓవైపు ఎండ, మరోవైపు వానలో గుట్టలు ఎక్కుతూ దిగుతూ నాలుగు రోజుల పాటు 60 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ క్రమంలో జవాన్ల కాళ్లకు బొబ్బలెక్కి నడవలేని స్థితికి చేరుకున్నారు. దీంతో గుట్టల్లో చిక్కుకున్న వారందరినీ స్థానికుల సహాయంతో గుర్తించి ఆర్మీ హెలికాప్టర్లలో హాస్పిటల్స్‌కు తరలించాల్సి వచ్చింది. ఇప్పుడూ అదే పరిస్థితి కర్రె గుట్టలపై కూంబింగ్ చేస్తున్న దళాలకు ఎదురవుతోంది. అప్పుడు వానల వల్ల ఇబ్బంది పడితే, ఇప్పుడు ఎండల వల్ల కూంబింగ్‌కు ఆటంకం కలుగుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.