యాసంగిలో సాగు 40లక్షల ఎకరాలు

యాసంగిలో సాగు 40లక్షల ఎకరాలు

హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగిలో 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు యాక్షన్‌‌ ప్లాన్‌‌ సిద్ధమైంది. ఈనెల మూడో వారం నుంచి ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లు విడుదల చేస్తామని ఇరిగేషన్‌‌ అధికారులు చెప్తున్నారు. ఆన్‌‌ ఆఫ్‌‌ పద్ధతిలో ఏప్రిల్‌‌ వరకు కనీసం 8 నుంచి 9 తడులు ఇవ్వడానికి సర్కారు ఆమోదం తెలిపినట్టు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావం నుంచి రబీలో ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల కింద ఈ మొత్తంలో భూమి సాగులోకి రావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు యాసంగిలో 20 లక్షల ఎకరాలకు మించి ప్రాజెక్టులు, చెరువుల కింద భూమిసాగులోకి రాలేదు.

ఎస్సారెస్పీ కింద12.10 లక్షల ఎకరాలు

శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు స్టేజ్‌‌-1 కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ నుంచి ఎల్‌‌ఎండీ వరకు 4 లక్షల ఎకరాలకు, అలీ సాగర్‌‌, గుత్ప, ఇతర పథకాల కింద మరో లక్ష ఎకరాలు, ఎల్‌‌ఎండీకి దిగువన 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్లాన్‌‌ చేస్తున్నారు. గతేడాది 9 తడుల్లో నీళ్లు ఇవ్వగా ఈ సారి పది తడులు ఇచ్చేందుకైనా సిద్ధమని ఇంజనీర్లు చెప్తున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్‌‌-2 కింద ఈ యేడు 2.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెయిల్‌‌ ఎండ్‌‌లోని 644 చెరువులకు 435 నింపుతున్నారు. ఎస్సారెస్పీలో 89, ఎల్‌‌ఎండీలో 17.89 టీఎంసీల నీళ్లు ఉండటంతో యాసంగి ఆయకట్టుకు డోకా లేదు.

సాగర్‌‌ ఎడమ కాలువ కింద 6.40 లక్షల ఎకరాలు

సాగర్‌‌ ఎడమ కాలువ కింద యాసంగిలో 6.40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది.  ఇందుకు 50 టీఎంసీల నీటిని వాడాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రబీలో తొలిసారిగా సాగర్‌‌ ఎడమ కాలువ ఆయకట్టు పూర్తిగా సాగులోకి రానుంది.  గతేడాది 27.39 టీఎంసీల నీటిని ఆన్‌‌ అండ్‌‌ ఆఫ్‌‌ పద్ధతిలో ఇవ్వడంతో 4,15,292 ఎకరాలు సాగులోకి వచ్చింది. సాగర్‌‌లో 282 టీఎంసీల నీళ్లు ఉండగా, డెడ్‌‌ స్టోరేజీకి ఎగువన 151 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రాష్ట్ర వాటాగా 80 టీఎంసీలకు పైగా నీళ్లు దక్కనున్నాయి. 50 టీఎంసీలు సాగర్‌‌ ఎడమ కాలువకు, 20 టీఎంసీలు ఏఎమ్మార్‌‌ ఎస్‌‌ఎల్బీసీకి, 10 టీఎంసీలు గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ తాగునీటికి కేటాయించే అవకాశముంది.

కల్వకుర్తి కింద 1.80 లక్షల ఎకరాలు

శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన కల్వకుర్తి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీం కింద యాసంగిలో 1.80 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. తాగునీటి అవసరాలు లెక్కించి మొత్తంగా శ్రీశైలం నుంచి 20 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలంలో 180 టీఎంసీల నీళ్లు ఉండగా, ఎండీడీఎల్‌‌కు ఎగువన 127 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.

జూరాల కింద 90 వేల ఎకరాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భీమా, నెట్టెంపాడు కింద 30 వేల ఎకరాల చొప్పున,  జూరాల ఆయకట్టు 30 వేల ఎకరాలు కలుపుకొని మొత్తంగా 90 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు.