ఆన్‌లైన్ దోపిడీ ఇంతనా: ప్లేట్ ఉప్మా 120 రూపాయలా.. అదే హోటల్‌లో రూ.40 మాత్రమే

ఆన్‌లైన్ దోపిడీ ఇంతనా: ప్లేట్ ఉప్మా 120 రూపాయలా.. అదే హోటల్‌లో రూ.40 మాత్రమే

జోమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల పుణ్యమా అని జనాలు దాదాపు వండుకోవడం మానేశారు. ఆకలి వేసిందా..! చేతికి మొబైల్ అందుకోవడం.. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టి కడుపుబ్బా ఆరగించడం. ఆఖరికి ఇంటికి బంధువులు వచ్చినా ఇదే చేస్తున్నారు. ఎవరు వండి పెడతారులే అన్నట్లు ఏదో ఒకటి ఆన్‌లైన్‌లో తెప్పించి వడ్డిం చేస్తున్నారు. ఈ సోమరితనాన్ని ఫుడ్ డెలివరీ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. అందుకు నిదర్శనం ఈ కథనం. 

రూ.40. ఉప్మాను 120 రూపాయలకు అమ్ముతున్నారు

ప్లేట్ ఉప్మా హోటల్‌లో రూ.40.. ఆన్‌లైన్‌లో తెప్పిస్తే రూ.120.. ఇందులో ఏముంది.. డెలివరీ చార్జీలు ఉంటాయి కదా..! అనకండి.. 120 రూపాయలు వాస్తవ ధర. డెలివరీ చార్జీలు దానికి అదనం. ఇదే ఓ యువకుడిని ఆశ్చర్యపరిచింది. వెంటనే ఫుడ్ డెలివరీ సంస్థల దోపిడీని బయట ప్రపంచానికి తెలియజేశాడు. 

హోటల్‌కు స్వతహాగా వెళ్లి కొంటే ఉప్మా ధర ఎంత..? అదే ఉప్మాను ఆన్‌లైన్ కొంటే ఎంత చెల్లించాలి..? అనే ధరల మధ్య బేధాన్ని ఒక యువకుడు క్లుప్తంగా వివరించాడు. అందుకు ముంబైలోని ఓ ఉడిపి హోటల్ బిల్లును ప్రత్యక్ష ఉదాహరణగా చూపాడు. హోటల్ బిల్లులో ప్లేట్ ఉప్మా ధర రూ.40గా ఉంటే, జొమాటా(Zomato) యాప్‌లో అదే ఉప్మా ధర రూ.120గా ఉంది. వైరుధ్యం అక్కడితో ఆగలేదు. మరో టిఫిన్ తట్టే ఇడ్లీ ధర రూ. రెస్టారెంట్‌లో 120 రూపాయలుగా ఉంటే, జోమాటో యాప్‌లో రూ.160గా ఉంది. అందుకు సంబంధించిన సదరు జోమాటో యాప్ స్క్రీన్ షాట్‌ను అతను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

జోమాటో రిప్లై

ఈ ఘటనపై జోమాటో సంస్థ సదరు యువకుడికి వివరణ ఇచ్చింది. "మా ప్లాట్‌ఫారమ్‌లోని ధరలు పూర్తిగా మా రెస్టారెంట్ భాగస్వాములచే నియంత్రించబడతాయి. అయినప్పటికీ, మేము మీ ఆందోళనలను, అభిప్రాయాన్ని వారితో పంచుకుంటాము..' అని తెలిపింది.

ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయ్యింది. రెస్టారెంట్ల ధరల తారుమారుపై వినియోగదారులు డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మరికొందరు దీనిని సమర్థిస్తున్నారు. వండుకొని తినలేని వారికి ఇలాంటిధీ జరిగాల్సిందేనంటూ శాపనార్థాలు పెడుతున్నారు.