అస్తవ్యస్తంగా సర్కారీ విద్య.. నాగర్​కర్నూల్​ జిల్లాలో 40 బడులు క్లోజ్

అస్తవ్యస్తంగా సర్కారీ విద్య.. నాగర్​కర్నూల్​ జిల్లాలో 40 బడులు క్లోజ్
  • వంద స్కూళ్లలో భారీగా తగ్గిన స్టూడెంట్స్
  • విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో టీచర్ల కొరత
  • డిప్యూటేషన్ల కోసం మంత్రి, ఎమ్మెల్యేలతో పైరవీలు

నాగర్ కర్నూల్, వెలుగు: సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి చేపట్టిన బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్​ మొదటివారంలో గవర్నమెంట్​ స్కూల్​ టీచర్లు బడిబాటలో భాగంగా  బడి బయట ఉండే పిల్లలను స్కూళ్లకు రప్పించేందుకు చేసిన ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. ఏజెన్సీల బిల్లుల పెండింగ్​తో స్కూళ్లలో పిల్లలకు భోజనం పెడతారనే గ్యారెంటీ లేకుండా పోయింది. వివిధ కారణాలతో జిల్లాలో 43 ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్  శాశ్వతంగా మూతబడ్డాయి. బిజినేపల్లి మండలంలో4, తాడూరులో1, తెల్కపల్లిలో 3, పెద్దకొత్తపల్లిలో 2, కోడేరులో 6, కొల్లాపూర్​లో 2, బల్మూరులో 2, ఉప్పునుంతలలో 4, చారకొండలో 4, అచ్చంపేట పట్టణం, అమ్రాబాద్, పదర  మండలాల్లో ఒక్కో స్కూల్​ చొప్పున మూతబడ్డాయి. కల్వకుర్తి పట్టణంలో 1, వెల్దండ మండలంలో 3,ఊర్కొండ మండలంలో 3 స్కూల్స్​ క్లోజ్​ చేశారు.  మరో  107 గవర్నమెంట్​ స్కూల్స్​లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 

పైరవీలు షురూ..  

హైదరాబాద్, మహబూబ్​నగర్​ నుంచి అప్​ అండ్​ డౌన్​ చేసే టీచర్లు మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో పని చేసేందుకు ఆసక్తి చూపెట్టడం లేదు. ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేల రికమండేషన్, మామూళ్లు ఇస్తూ తిమ్మాజీపేట, బిజినేపల్లి, వెల్దండ మండలంలో హైవే, మెయిన్​ రోడ్  పక్కనున్న స్కూల్స్​కు డిప్యూటేషన్లు వేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో అప్పుడే పైరవీలు స్టార్ట్​ చేశారు. స్కూల్​ కాంప్లెక్స్​ పరిధిలోని హైస్కూల్స్, ప్రైమరీ స్కూల్స్​లోని ఖాళీలను వర్క్​ అడ్జస్ట్​మెంట్​ కింద డిప్యూటేషన్లతో సర్దుబాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. 180 మంది టీచర్ల లిస్ట్​ను సోమవారం డీఈవో గోవిందరాజులు కలెక్టర్​కు సబ్​మిట్​ చేశారు. జడ్చర్ల, మహబూబ్​నగర్, హైదరాబాద్​కు దగ్గరగా ఉన్న మండలాల్లో ఖాళీలను నింపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఏజెన్సీ ప్రాంతంలోని కోడేరు, పెద్ద కొత్తపల్లి, అమ్రాబాద్, పదర, లింగాల, బల్మూర్, వంగూరు మండలాల్లోని హైస్కూళ్లలో ఏండ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉన్నా డిప్యూటేషన్ పై టీచర్లను కేటాయించడం లేదు.​  కోడేరు మండల కేంద్రంలోని హైస్కూల్​లో గత ఏడాది బయాలజీ, ఇంగ్లిష్, హిందీ టీచర్​ లేకుండానే గడిచిపోయింది. ఈ స్కూల్​లో 21 మంది టీచర్లు,పీజీ హెచ్ఎం పనిచేయాల్సి ఉండగా 11 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. ఇంతే కాకుండా విద్యార్థులు లేని స్కూల్​కు ఒకే సబ్జెక్ట్​ చెప్పే ముగ్గురు టీచర్లను కేటాయించారు. వర్క్​ అడ్జస్ట్​మెంట్​ పేరుతో అక్రమంగా డిప్యుటేషన్లపై వెళ్తున్నారు. దీంతో జిల్లాలో సర్కారీ విద్యపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు.

వేధిస్తున్న టీచర్ల కొరత..

ఒకవైపు పిల్లలు లేరని స్కూల్స్​ మూసేస్తే, మరోవైపు స్టూడెంట్స్​ ఉన్న హై స్కూల్స్​లో సబ్జెక్ట్​ టీచర్ల కొరత వేధిస్తోంది. కీలకమైన మ్యాథ్స్​,ఫిజిక్స్, ఇంగ్లిష్, బయాలజీ  సబ్జెక్ట్​ టీచర్లు లేకుండా, ఒక్క పాఠం చెప్పకుండానే గత విద్యాసంవత్సరంలో స్టూడెంట్స్​ ఎగ్జామ్స్​ రాసిన స్కూల్స్​ఎన్నో ఉన్నాయి. 
జిల్లాలోని 7 గవర్నమెంట్​ స్కూళ్లలో 185 టీచర్​ పోస్టులు ఉండగా, 126   మంది టీచర్లు పని చేస్తున్నారు. లోకల్​ బాడీస్​ స్కూళ్లలో 3,545 టీచర్​ పోస్టులు ఉంటే 3,073 మంది టీచర్లు ఉన్నారు. ఈ లెక్కన జిల్లాలో 531 టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సింగిల్​ టీచర్​ స్కూల్స్, హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా అందుకు అనుగుణంగా టీచర్లు లేరు.