గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే: తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు

గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే: తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని అత్యంత ఖరీదైన 400 ఎకరాల భూమి ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. గత 18 ఏండ్లుగా వివాదాస్పదంగా ఉన్న ఈ భూమి వ్యవహరంపై గురువారం తుది తీర్పు రావడంతో రెవెన్యూ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని 2006లో నాటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమిక్స్, భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. 

అదే ఏడాది ఈ కేటాయింపులను నాటి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఐఎంజీ అకాడమిక్స్, భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కోర్టుకు వెళ్లాయి. ఈ వివాదంపై 2006 నవంబర్ 29న అప్పటి హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో పాటు తుది తీర్పు వెలుబడే వరకు సదరు భూమి ప్రభుత్వ అధీనంలో ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తూనే ఉంది. దీంతో గచ్చిబౌలి స్టేడియానికి అనుకొని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఈ 400 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. తాజాగా హైకోర్టు తీర్పుతో ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. వీటితో పాటు సరూర్ నగర్ మండలం మామిడిపల్లి గ్రామ సర్వే నంబర్ 99/1లో ఇదే సంస్థలకు కేటాయించిన 450 ఎకరాల భూములు సైతం ప్రభుత్వానికే చెందుతాయని తీర్పు వెల్లడించింది.