రోజుకు 40 వేల టెస్టులు ఉత్తదేనా?..రాష్ట్ర కేబినెట్ నిర్ణయం ఏమైంది?

రోజుకు 40 వేల టెస్టులు ఉత్తదేనా?..రాష్ట్ర కేబినెట్ నిర్ణయం ఏమైంది?
  • కరోనా టెస్టులపై 
  • డెసిషన్ తీసుకొని వారమైనా 24 వేలు దాటుతలేవు
  • మస్తు చేస్తున్నట్లు కేంద్రానికి రిపోర్టులు
  • టెస్టులు పెంచినట్లు ప్రధానికి చెప్పిన సీఎం
  • 40 వేలు చేస్తున్నట్లు ట్విట్టర్లో కేటీఆర్ ఆన్సర్
  • అసలు లెక్కలు బయటపెడుతున్నహెల్త్ బులెటిన్

 

ప్రతి రోజూ 40 వేల కరోనా టెస్టులు చేయాలని ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కానీ.. ఆ రోజు నుంచిఇప్పటివరకు రోజూ చేస్తున్న టెస్టులు 24 వేలు కూడా దాటుతలేవు. సగటున 20,808 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. దీంతో కేబినెట్ నిర్ణయం ఉత్తదేనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెస్టులు చేసేందుకు హెల్త్డిపార్ట్మెంట్ సిద్ధంగా లేదా? లేక ప్రభుత్వమే టెస్టు లు తక్కువ చేయాలని చెబుతున్నదా? అనే చర్చ జరుగుతోంది. కరోనా టెస్టులు పెంచడానికి సర్కార్‌ పెద్దలకు మనసు ఒప్పుతలేదు. టెస్టింగ్‌ కిట్లు, హెల్త్ స్టాఫ్ అందుబాటులో ఉన్నా.. టెస్టుల కోసం జనం  ఇబ్బంది పడుతున్నా..అంతంతమాత్రంగానే టెస్టులు చేస్తున్నారు. హైకోర్టు నుంచి ప్రధాన మంత్రి వరకూ అందరూ మొట్టికాయలు వేసినా టెస్టులు పెంచడం లేదు. టెస్టులు పెంచుతున్నామని ప్రకటనలుజేసుడే తప్ప, అమల్లోకి మాత్రం తేవడం లేదు. రోజుకు 40 వేల టెస్టులు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని వారం రోజులు అవుతున్నా అది అమల్లోకి రాలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

టెస్టులపై సర్కార్‌ మొదట్నుంచీ ఇదే తీరును ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో ఫిబ్రవరి చివర్లో కరోనా కేసులు మొదలయ్యాయి. మార్చి రెండో వారం నుంచిగాంధీ హాస్పిటల్లో టెస్టులు చేయడం ప్రారంభించారు. మార్చి నుంచి ఏప్రిల్ రెండో వారం వరకూ అవసరమైన మేర టెస్టులు చేశారు. కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్‌‌20 నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ కు టెస్టులు చేయడం ఆపేశారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో మే చివరి నాటికి టెస్టుల సంఖ్య లక్షల్లోకి చేరితే మన దగ్గర 27 వేల దగ్గరే ఆగిపోయింది. టెస్టుల కోసం జనం ఎమ్మెల్యేల నుంచి రికమండేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో తక్కువ టెస్టులపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దలేమో టెస్టులు చేస్తే ప్రైజ్‌లు ఇస్తారా..? అంటూ నిరక్ష్ల్యం చేస్తూ వచ్చారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో జూన్‌లో టెస్టుల సంఖ్య కొద్దిగా పెంచక తప్పలేదు. దీంతో కేసులు పెరిగాయి. జూన్ 16 నాటికి ఏపీలో 5,83,286 టెస్టులు చేస్తే..మన దగ్గర 44,431 టెస్టులు చేశారు. అప్పటికి ఏపీలో 6,720 కేసులు నమోదైతే.. మన దగ్గర 5,406 నమోదయ్యాయి.ఏపీలో పాజిటివ్‌‌రేట్ 1.15 శాతం ఉంటే, మన దగ్గర 12.16 శాతానికి పెరిగింది. అయినా, ఏపీ సర్కార్‌ టెస్టులు సంఖ్యను పెంచుతూనే పోయింది. మన సర్కార్ మాత్రం పెంచుతున్నామనే ప్రకటనలే తప్పపెంచలేదు. ఈ నెల 5న కేబినెట్ నిర్ణయం  తీసుకున్నా టెస్టులు పెంచడంలేదు. ఈ వారం రోజుల్లో సగటున రోజుకు 20,808 టెస్టులు మాత్రమే చేశారు.

అన్నీ ఉన్నాయంటరు.. మరి టెస్టులు పెంచరు

ప్రస్తుం 16 ప్రభుత్వ ల్యాబులు, 23 ప్రైవేట్ ల్యాబుల్లో ఆర్టీపీర్టీ సీఆర్ టెస్టులు చేస్తున్నారు. ఆర్టీపీర్టీసీఆర్ టెస్టింగ్ కెపాసిటీ 14 వేలు ఉందని చెబుతున్నప్పటికీ.. రోజుకు ఐదారు వేలకు మించి చేయట్లేదు.ఇప్పడు చేసేటెస్టుల్లో 80 శాతం యాంటీజెన్‌ టెస్టులే ఉంటున్నాయి. ఈ టెస్టులకు పెద్ద సెటప్ అవసరం లేదు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు ఎవరైనా ఎక్కడైనా చేసేయొచ్చు. ప్రస్తుం 323 దవాఖాన్లలో యాంటీజెన్‌ టెస్టులు చేస్తున్నట్టు సర్కార్ చెబుతోంది.వీటిల్లో రోజుకు వంద టెస్టులు చేసినా రోజుకు 32,300 టెస్టులు చేయొచ్చు. మన రాష్ట్రంలో 885 ప్రైమరీ హెల్త్సెంటర్స్ ఉన్నాయి. ప్రతి కేంద్రంలో డాక్టర్ నర్స్‌ తప్పకుండా ఉంటారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 50 టెస్టులు చేసినా రోజుకు 44,250 టెస్టులు చేయొచ్చు. టెస్టింగ్ కిట్లు అక్కడికి పంపిస్తే, మరుసటి రోజు నుంచే టెస్టులు స్టార్ట్ చేయొచ్చు. పది లక్షల టెస్టింగ్ కిట్లు ఉన్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. ఇన్ని కిట్లు ఉండి టెస్టులు చేయడానికి అభ్యంతరమేంటన్నది ప్రశ్నార్థకంగ మారింది. టెస్టులు చేస్తే కరోనా కంట్రోల్ అవుద్దా అని ఇటీవల మంత్రి ఈటల అన్నారు. ఆ మాటలు టెస్టుల విషయంలో సర్కార్‌ వైఖరి ఏమిటో స్పష్టం చేస్తున్నాయి.

ఎట్టకేలకు తెలుగులో బులెటిన్‌

ఇది వరకూ జరిగిన విచారణలో తెలుగులో కరోనా బులెటిన్ విడుదల చేయాలని, అన్ని వివరాలను బులెటిన్‌లో పొందుపర్చాలని కోర్టుఆదేశించింది. కానీ, ప్రభుత్వం కోర్టుతీర్పును అమల్లోకి తేలేదు.గురువారం విచారణ సందర్భంగా హడావుడిగా తెలుగులో 5 పేజీల బులెటిన్‌ను విడుదల చేసింది.

 కేబినెట్ నిర్ణయం నుంచి ఇప్పటివరకు..

ప్రతి రోజు 40 వేల టెస్టులు చేయాలని రాష్ట్రకేబినెట్ ఈ నెల 5న నిర్ణయం తీసుకుంది. ఆ రోజు వరకు రాష్ట్రంలో 5,43,489 టెస్టులు చేశారు. ఆగస్టు 5 నుంచి 12 వరకు 1,45,661 టెస్టులే చేశారు. ఏ రోజూ 24 వేలకు మించి టెస్టులు దాట లేదు. రాష్ట్రంలో బుధవారం వరకు 6,89,150 టెస్టులు చేశారు

చెప్పేది ఇట్ల.. బులెటిన్లో అట్ల

టెస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్న మాటలకు, హెల్త్బులెటిన్లోని లెక్కలకు పొంతన కుదరడం లేదు. రాష్ట్రంలో రోజూ 40 వేల టెస్టులు చేస్తున్నట్టు మూడు రోజుల కింద రాష్ట్రానికి వచ్చిన సెంట్రల్ టీంకు ప్రభుత్వం చెప్పింది. ఈ నెల 9నట్విట్టర్ వేదికగా జరిగిన ‘ఆస్క్ కేటీఆర్’లో ప్రతి రోజూ 40 వేల టెస్టులు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నెల 11న ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో టెస్టులు పెంచినం. ఎక్కువగా చేస్తున్నం’’ అని వివరించారు. అయితే.. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి, బుధవారం రాత్రి 8 గంటల వరకూ అంటే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23,303 మందికి టెస్ట్ చేనట్లుహెల్త్ డిపార్ట్మర్ట్ మెంట్ గురువారం ప్రకటించింది. అంతకు ముందురోజు కూడా అటూ ఇటుగా ఇన్నే టెస్టులు చేసినట్లు పేర్కొంది.

టెస్టుల్లో దేశంలోనే లాస్ట్‌‌

టెస్టుల సంఖ్యలో మన రాష్ట్రం ఇప్పటికే దేశంలో 18వ స్థా నంలో ఉంది. పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ మనకంటే చాలా ఎక్కువగా టెస్టు లు చేశారు. అస్సాం, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాలూ మనకంటే బెటర్‌గా ఉన్నాయి. పాజిటివ్ రేట్‌‌లో ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్ర (18.85 శాతం) తర్వాత స్థా నంలో తెలంగాణ (12.54శాతం) ఉన్నాయి. బీహార్‌‌‌‌, యూపీ, బెంగాల్‌‌, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని, ఇంకా చాలా పెంచాలని ఇటీవల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌‌లో ప్రధాని మోడీ సూచించారు. మోడీ చెప్పిన ఐదు రాష్ట్రాల్లోని టెస్టులతో పోలిస్తే మన రాష్ట్రమే చిట్టచివరన ఉంది. పైగా ఈ ఐదు రాష్ట్రాల్లోకెల్లా అత్యంత ఎక్కువ పాజిటివ్ రేట్‌‌(12.54 శాతం) ఉన్నది కూడా మన రాష్ట్రంలోనే.

మొదట్నించి విమర్శలే..

కరోనా టెస్టు ల విషయంలో ప్రభుత్వం మొదట్నించి విమర్శలు ఎదుర్కొంటున్నది. టెస్టు ల విషయమై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థా యిలో దుమ్మెత్తిపోశాయి. ఎందుకు తక్కువ టెస్టు లు చేస్తున్నారని కోర్టు కూడా నిలదీసింది. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం.. లక్షణాలు ఉన్న వారికే టెస్టు లు చేస్తామని ప్రభుత్వం వాదించింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో టెస్టు లు పెంచుతున్నట్టు ప్రకటించింది.కానీ ప్రకటించిన మేరకు టెస్టు లు నిర్వహించడం లేదు.