ఐదేండ్లలో .. తెలంగాణలో2,088 కి.మీ.పైగా రోడ్లు .. పెద్దపల్లిలో 41 కి.మీ రోడ్ల పనులు పూర్తి

ఐదేండ్లలో .. తెలంగాణలో2,088 కి.మీ.పైగా రోడ్లు .. పెద్దపల్లిలో 41 కి.మీ రోడ్ల పనులు పూర్తి
  • ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం రిప్లై

న్యూఢిల్లీ, వెలుగు: గడిచిన ఐదేండ్లలో (2020–25) ప్రధానమంత్రి గ్రామీణ్‌‌‌‌ సడక్‌‌‌‌ యోజన(పీఎంజీఎస్‌‌‌‌వై) కింద తెలంగాణలో 2,088.05 కి.మీ  పొడవు రోడ్డు నిర్మాణం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోడ్ల నిర్మాణం కోసం మొత్తం రూ.837 కోట్ల బడ్జెట్‌‌‌‌ కేటాయించినట్లు పేర్కొంది. ఈ మేరకు మంగళవారం లోక్‌‌‌‌సభలో పెద్దపల్లి  ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కమలేశ్ పాశ్వాన్‌‌‌‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఐదేండ్లలో పెద్దపల్లి జిల్లాలో 41.38 కి.మీ నిర్మాణం జరిగిందన్నారు. 

తెలంగాణ వ్యాప్తంగా 2020–21 లో 315.39 కి.మీ, 2021–22 లో 630.83 కి.మీ, 2022–23 లో  496.01 కి.మీ, 2023 –24 లో 492.92 కి.మీ, 2024–25 లో అతి తక్కువగా 152.89 కి.మీల రోడ్ల నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. కాగా.. పెద్దపల్లి జిల్లాలో 2021–22 లో అత్యధికంగా 18.13. కి.మీ పనులు చేపట్టినట్లు తెలిపారు. పీఎంజీఎస్ వై –1 కింద తెలంగాణలో వెనకబడిన ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో 1,641 కి.మీ రోడ్ల నిర్మాణం గుర్తించగా..ఇందులో 403 రోడ్ల పనులకు సంబంధించి 1439 కి.మీ నిర్మాణం పూర్తయిందన్నారు. మిగిలిన 43 రోడ్ల(144 కి.మీ పొడవు ) పనులు వివిధ దశల్లో ఉన్నట్లు కమలేశ్ పేర్కొన్నారు.