సిటీలో 16 రోజుల్లో 415  డెంగీ కేసులు

సిటీలో 16 రోజుల్లో 415  డెంగీ కేసులు
  • సిటీలో రోజుకు 30 నుంచి 40 దాకా నమోదు 
  • ఇది సర్కార్ ​దవాఖానల్లోని లెక్క
  • ప్రైవేట్​లో రెండింతలకు పైనే..  
  • ఆస్పత్రులకు పెరిగిపోయిన పేషెంట్లు
  • వచ్చే  రెండు నెలల్లో మరింత పెరిగే అవకాశం

హైదరాబాద్, వెలుగు: సిటీలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా హాస్పిటల్స్​కు వస్తున్న పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.  రోజుకు 30 నుంచి 40 దాకా నమోదవుతున్నాయి. బల్దియా పరిధిలో ఈ నెలలో నిన్నటి వరకు 415  కేసులు వచ్చాయి. డెంగీ అనుమానితులు ఫీవర్​ హాస్పిటల్​కు ఎక్కువగా వెళ్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదయ్యే లెక్క ఇలా ఉంటే,   ప్రైవేట్ ​హాస్పిటల్స్​లో రెండింతలు అదనంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల వరకు ఉదయం 11 గంటలు దాటితే ఓపీలో పెద్దగా పేషెంట్లు కనిపించలేదు. ప్రస్తుతం మధ్యాహ్నం12 దాటిన కూడా ఓపీలో క్యూ లైన్లలో నిల్చుంటున్నారు.  జిల్లాల నుంచి రెఫర్​ చేసే కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రైవేట్​ హాస్పిటల్స్​లో డెంగీ కేసుల లెక్క తెలియడంలేదు. పాజిటివ్​అని తేలగానే  అడ్మిట్​ చేసుకొని ట్రీట్​మెంట్​చేస్తున్నారు. కేసుల సంఖ్య మాత్రం రిపోర్టు చేయడం లేదని తెలిసింది. వాతావరణ మార్పులతో కొద్దిరోజులుగా దోమల వ్యాప్తి అధికమవడంతోనే  డెంగీ కేసులు వస్తున్నట్టు డాక్టర్లు పేర్కొంటున్నారు. 

గతేడాది కరోనా కారణంగా..
ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ లో  డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతుంంటాయి. గతేడాది కరో నా కారణంగా జనం ఇండ్లలోంచి బయటకు రాలేదు. ఇంటి పరిసరాలను క్లీన్​గా ఉండేలా చూసుకోవడంతో కొంత తగ్గాయి. బల్దియా కూడా ఫాగింగ్​ చేయడం, చెత్తను వెంటవెంటనే క్లీన్​చేయించింది. దీంతో గతేడాది మొత్తం 450  మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది మొదటి నుంచి పెద్దగా కేసులు రానప్పటికీ వారం రోజులుగా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. 

కంప్లయింట్ ​చేసినా స్పందించట్లే
సిటీలో దోమల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో బల్దియా ఎంటమాలజీ  సిబ్బంది ఫాగింగ్​చేయడం లేదని జనం ఆరోపిస్తున్నారు. దోమలపై కంప్లయింట్స్​వస్తున్న ప్రాంతాల్లోను వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు  ఎంటమాలజీ డిపార్ట్​మెంట్​కు 18,200 ఫిర్యాదులు వస్తే, అందులో 8,296 కంప్లయింట్స్​పెండింగ్​లోనే ఉన్నాయంటే పరిస్థితి అర్థమవుతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా డెంగీ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 

వెంటనే టెస్ట్​ చేయించుకోవాలె
 డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలపై దృష్టి పెట్టాం. దోమలు అధికంగా ఉండే ఏరియాల్లో  తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. డెంగీ లక్షణాలతో సర్కార్​ఆస్పత్రులకు వచ్చే వారికి టెస్టులు చేస్తున్నాం. రెండు, మూడు రోజులు జ్వరం, నీరసం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లి డెంగీ టెస్ట్​చేయించుకోవాలి. 
‑ నిరంజన్, డీఎంహెచ్ఓ, హైదరాబాద్​