కరోనా వైరస్ చైనాను కబళిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో కరోనా మృతుల సంఖ్య 425కు పెరిగింది. నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ తో 64 మంది చనిపోయారు. 20 వేల 4 వందల కరోనా కేసులు నమోదైనట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.
మన దేశంలో మూడో కరోనా కేసు నమోదైంది. కేరళలోనే మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈనెల 18న చైనా నుంచి వచ్చిన కర్ణాటకలోని హుబ్లికి చెందిన వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఫీవర్, దగ్గు, తలనొప్పితో అతడు బాధపడుతున్నట్లు హుబ్లీ వైద్యులు చెప్పారు. ఫిరోజాబాద్ కు చెందిన ఇమ్రాన్ లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ కు తరలించారు. ఐలోసేషన్ వార్డులో అతనికి చికిత్స అందిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో దగ్గు, జలుబుతో ఫీవర్ హాస్పిటల్ లో మరో వ్యక్తి అడ్మిట్ అయ్యారు. ట్రావెల్ హిస్టరీ ఉండటంతో అనుమానితుడిని ఐసోలేషన్ వార్డులో ఉంచామని వైద్యులు చెప్పారు. జనవరి 18 నుంచి ఇప్పటివరకు 2 వేల 733 మంది ప్రయాణికులు చైనా, హాంకాంగ్, థాయి లాండ్, సింగపూర్ హైదరాబాద్ వచ్చినట్లు కేంద్రం గుర్తించింది. వారందరికి వైద్య పరీక్షలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. కరోనా వైరస్ లక్షణాలు లేకున్నా టెస్టులు జరిపించాలని కేంద్రం సూచించింది.
ఒడిశాలోని కటక్ లో ఎనిమిది మంది అనుమానితులు హాస్పిటల్ లో చేరారు. వీరిలో ముగ్గుర్ని మాత్రమే అడ్మిట్ చేసుకుని ఐసోలేటెడ్ వార్డుల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కర్ణాటకలో 63 మంది అనుమానితుల శాంపిల్లను టెస్ట్ చేయగా.. వారెవరికీ వైరస్ సోకలేదని చెప్పింది ఆరాష్ట్ర ఆరోగ్యశాఖ. ఫ్లూ లక్షణాలతో వచ్చిన ఓ వ్యక్తికి ఐసోలేటెడ్ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపింది. చైనా నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు 8 వేల 878 మంది రాగా.. వారందరికి స్క్రీనింగ్ చేశారు. 21 మందిలో కరోనా లక్షణాలు కనిపించగా.. వారిని అబ్జర్వేషన్ లో ఉంచారు. 18 మందికి కరోనా వైరస్ నెగిటివ్ రిపోర్ట్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 33 8 శాంపిల్స్ రాగా.. అందులో మూడు కేసుల్లో మాత్రమే వైరస్ పాజిటివ్ వచ్చిందని నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ వైరాలజీ ప్రకటించింది. కరోనా వైరస్ పై కేంద్ర వైద్యశాఖ 104 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
