రష్యా చమురు కొనుగోళ్లపై నీతులు వద్దు..పశ్చిమ దేశాల నోరు మూయించిన భారత విదేశాంగ మంత్రి జై శంకర్

రష్యా చమురు కొనుగోళ్లపై నీతులు వద్దు..పశ్చిమ దేశాల నోరు మూయించిన  భారత విదేశాంగ మంత్రి జై శంకర్

ఫిన్లాండ్: రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమర్థించారు. ఈ నిర్ణయంపై నైతికతను ప్రశ్నించిన పశ్చిమ దేశాల విమర్శకులకు ధీటుగా బదులిచ్చారు. యూరప్‌‌‌‌‌‌‌‌లో తయారైన ఆయుధాలు భారత్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ఉపయోగపడ్డాయని, పశ్చిమ దేశాలపై దాడికి భారత్ ఎన్నడూ ఎలాంటి ఆయుధాలూ సరఫరా చేయలేదని గుర్తుచేశారు. 

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌‌‌‌‌‌‌‌కు నీతులు చెప్పే అర్హత పశ్చిమ దేశాలకు లేదన్నారు. ఫిన్లాండ్ పర్యటనలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ముడి చమురును కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయం కేవలం తక్కువ ధర, లభ్యతపైనే ఆధారపడి ఉందన్నారు.

 2022లో రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐరోపా దేశాలు మధ్యప్రాచ్యం నుంచి చమురు కొనడం ప్రారంభించాయని చెప్పారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లను స్థిరీకరించేందుకు, చమురును కొనుగోలు చేయాలని అమెరికా స్వయంగా భారత్‌‌‌‌‌‌‌‌ను కోరిందని గుర్తుచేశారు. పరిస్థితుల వల్లే భారత్ రష్యా వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. 

ఆంక్షలు, వాణిజ్యం, ఇంధన భద్రత విషయంలో పశ్చిమదేశాల విధానాలలో ఉన్న వైరుధ్యాలను ప్రశ్నించారు. జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రత, ఆర్థిక అంశాల ఆధారంగానే భారత ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.