రెండు స్థానాల్లో కలిపి 42,945 చెల్లని ఓట్లు

రెండు స్థానాల్లో కలిపి 42,945 చెల్లని ఓట్లు
  • గ్రాడ్యుయేట్లకూ ఓటెయ్యరాలే
  • ఫస్ట్​ ప్రయారిటీ ఓటేయకుండానే మిగతా నంబర్లు
  • సీరియల్ నంబర్లకు బదులు టిక్కులు, బొమ్మలు
  • క్యాండిడేట్ల ఫొటోలు రౌండప్​, పేర్లు రాసిన్రు

వెలుగు, నెట్​వర్క్: వాళ్లంతా డిగ్రీలు, పీజీలు చేసిన గ్రాడ్యుయేట్లు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతరత్రా పెద్ద చదువులు చదువుకున్నోళ్లు. వారిలో చాలామంది ప్రభుత్వ, ప్రైవేట్ జాబులు, బిజినెస్​లు చేస్తున్నారు. కానీ వేల మందికి ఓటేయడం రాలేదు. ప్రయారిటీ ప్రకారం ఓటేయడంలో కన్ఫ్యూజ్​అయ్యారు. ఈ క్రమంలో చిత్రవిచిత్రమైన తప్పులు చేశారు. ఈ నెల 14న హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్​నగర్, వరంగల్– ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. బుధవారం నుంచి హైదరాబాద్​, నల్గొండ కేంద్రాల్లో కౌంటింగ్​జరుగుతోంది. ప్రతి రౌండ్​లోనూ మూడు వేల వరకు చెల్లని ఓట్లు వస్తుండడంతో కౌంటింగ్​ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. హైదరాబాద్–-రంగారెడ్డి-–మహబూబ్​నగర్​నియోజకవర్గంలో మొత్తం 3,58,348 ఓట్లు పోలవగగా 21,309(5.94శాతం) ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక వరంగల్-– ఖమ్మం-– నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానంలో 3,87,969 ఓట్లు పోలవగా, 21,636(5.57శాతం) ఓట్లు చెల్లలేదు. మొత్తం మీద రెండు నియోజకవర్గాల్లో కలిసి 42వేల 945 ఓట్లు చెల్లలేదు. అంటే ప్రతి 100 మందిలో దాదాపు ఆరుగురికి ఓట్లేయడం రాలేదు.

చిత్రవిచిత్రమైన తప్పులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటువేసే విధానం సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పేరు, ఫొటోకు ఎదురుగా ఉన్న బాక్స్ లో ప్రయారిటీ ప్రకారం 1, 2, 3.. నంబర్లు వేయాల్సి ఉంటుంది. అయితే కొందరు ఓటర్లు సీరియల్ నంబర్లకు బదులు టిక్కులు, X మార్కులు పెట్టారు. కొందరైతే ఏకంగా పార్టీ గుర్తుల బొమ్మలేశారు. కొందరు క్యాండిడేట్​బొమ్మకు రౌండ్​చుట్టి బ్యాలెట్ పేపర్​ వెనుకాల పేరు రాశారు. ఇంకొందరేమో ఒకే నంబర్​ను ఎక్కువ మందికి వేశారు. అంటే ‘1’ నంబర్​నే ఎక్కుమందికి వేశారు. మరికొందరు మధ్యలో నంబర్​ను మిస్ చేశారు. అంటే ‘1’ వేశాక ‘2’ను వదిలేసి మళ్లీ ‘4’, ‘6’ ఇలా వేశారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా హైదరాబాద్- స్థానానికి 93, వరంగల్ స్థానానికి 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండుచోట్ల బ్యాలెట్ పేపర్లు న్యూస్ పేపర్ సైజులో ఉన్నాయి. దీంతో అభ్యర్థులు తమ సీరియల్​నంబర్లతో ప్రచారం చేసుకున్నారు. దీంతో కొందరు ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి ఎదుట వారి సీరియల్ నంబర్లు వేశారు. ఉదాహరణకు హైదరాబాద్​స్థానంలో 4వ సీరియల్​నంబర్ లో ఉన్న సురభి వాణిదేవి గడిలో ‘4’ ఓటేశారు. ఇట్లా గ్రాడ్యుయేట్లు చేసిన చిత్రవిచిత్రాలను చూసి కౌంటింగ్ స్టాఫ్ ఆశ్చర్యపోయారు. సహజంగా చదువుకోనివాళ్లే ఇలాంటి తప్పులు చేస్తుంటారని, కానీ డిగ్రీ, ఆపైన చదివిన వాళ్లు కూడా ఇలాంటి తప్పులు చేయడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు.